– ఆగస్టు 18, క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందన సభ!”
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆగస్టు 18న క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
గత రెండేళ్లుగా క్షత్రియ వైభవానికీ, వారి ఐక్యతకూ కృషి చేస్తూ, అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ, సామాజిక పరంగా అప్పగించిన బాధ్యతలను తు.చ. తప్పకుండా నిర్వర్తిస్తున్న క్షత్రియసేవా సమితి (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) మరో ప్రత్యేకమైన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.
అందులో భాగంగా ‘క్షత్రియ సేవాసమితి (TS & AP) సంస్థ తరపున అధ్యక్షుడు పేరిచర్ల నాగరాజు ఆధ్వర్యంలో… ఉపాధ్యక్షుడు వేగేశ్న వెంకటేశ్వరరాజు, డా కలిదిండి రఘురామరాజు, కోశాధికారి పెన్మెత్స వెంకటేశ్వరరాజులు నడింపల్లి రవి సహాయంతో ముఖ్యమంత్రితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి క్షత్రియుల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.
క్షత్రియుల తరపున ముఖ్యమంత్రికి భారీ అభినందన సభ ఏర్పాటు చేయాలని ఎప్పటినుండో కోరుతున్న విషయం గుర్తుచేయగా ముఖ్యమంత్రి అంగీకారం తెలియజేస్తూ ఆగష్టు 18తేదీ దానికి కేటాయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి క్షత్రియ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటికే ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి వారికి అద్భుతమైన సభలు నిర్వహించి నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఆయా సభలను విజయవంతం చేసిన సమితి, ఈ సభనూ అదే స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు మొదలు కానున్నాయి
ఇప్పటి వరకూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరికీ సన్మానం చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. తొలిసారిగా ఇప్పుడు అందుకు సమ్మతించటంతో దక్కిన ఈ అవకాశం అరుదైనది కనుక అందుకు తగినట్టుగా అంగరంగ వైభవంగా ఈ అభినందన సభ ఉండే విధంగా అందరితో కలసి నిర్వహించే విధంగా ప్రణాళికలతో క్షత్రియ పెద్దలతో చర్చించి, వారి సూచనలు సలహా సహాయ సహకారాలతో సన్మాన కార్యక్రమం వివరాలు త్వరలో తెలియచేస్తామన్నారు.
తాము తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో అండదండగా ఉంటూ వెన్నంటి ప్రోత్సాహిస్తున్న క్షత్రియ పెద్దలు, మహిళలు, యువత అందరూ మరో సారి తమతమ సహకారాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయవలసిందిగా మనవి చేస్తున్నామంటూ ఈ సందర్భంగా సంఘం తరపున అధ్యక్షుడు పేరిచర్ల నాగరాజు, కార్యదర్శి నడింపల్లి నానిరాజు, ఇతర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో కోరారు.