పేదల కడుపు నింపడమే సీఎం లక్ష్యం

– గ‌త వైసీపీ ప్ర‌భుత్వం అన్న క్యాంటీన్లను ఎందుకు మూసేసిందో అర్థం కావట్లేదు
– మన ప్రభుత్వ హయాంలో రీఒపెన్‌ చేయడం గొప్ప విషయం
– సీఎం చంద్రబాబుని పది సార్లు కాదు వెయ్యి సార్లు గుర్తుకు తెచ్చుకోవాలి
– శుచి, శుభ్రతతో కూడిన భోజనం అందిస్తున్నారు
– ఇలాంటి గొప్ప కార్యక్రమంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది
– నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
– నెల్లూరు సిటీ పరిధిలోని కొత్తహాలు సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించిన ఎంపీ
– పేదలకు స్వ‌యంగా టిఫిన్లు వ‌డ్డించి, వారితో కలసి టిఫిన్‌ చేసిన ఎంపీ

నిరుపేదల కడుపు నింపేలా నారా చంద్రబాబు తీసుకువచ్చిన అన్నా క్యాంటీన్లు ఆయన గొప్ప ఆలోచనలకు నిదర్శనమని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేసిందో అర్థం కావడం లేదన్నారు. నెల్లూరు సిటీ పరిధిలోని కొత్త హాలు సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ ను జేసీ కార్తిక్‌ తో కలిసి ఎంపీ ప్రారంభించారు. ముందుగా క్యాంటీన్‌ వద్దకు చేరుకున్న ఎంపీని స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శాలువాలు, పుష్కగుచ్ఛాలు అందించి సత్కరించారు. అనంతరం క్యాంటీన్లోకి చేరుకున్న ఎంపీ, జేసీ కార్తిక్‌ … వసతులపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా క్యాంటీన్‌లో పేదలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్వ‌యంగా టిఫిన్ వ‌డ్డించారు. అనంత‌రం జేసీ కార్తిక్‌ , టీడీపీ నేత‌లు, నిరుపేద‌ల‌తో క‌లిసి ఆయ‌న కూడా టిఫిన్‌ చేశారు. ఈ రోజు అన్నా క్యాంటీన్ కు వచ్చే వారి ఖర్చును ఎంపీ భరించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఈ రోజు ఉద‌యం 7.30 గంట‌ల‌కే రాష్ట్రంలో 99 క్యాంటీన్లు ప్రారంభం కావడం గొప్ప విషయమన్నారు. పేదలు కడుపు నిండా అన్నం పెట్టడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లకు రూపకల్పన చేశారన్నారు. అయితే గత ప్రభుత్వం వీటిని మూసి వేసి పేదల కడుపు కొట్టిందని చెప్పారు. ప్రస్తుతం అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కావడం సీఎం గొప్ప ఆలోచనలకు నిదర్శనమన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో తనను భాగస్వాములను చేసిన మంత్రి నారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబుని వెయ్యి సార్లు తలుచుకున్నా తక్కువేనని కొనియాడారు. కేవ‌లం రూ. 5ల‌కే పేదలు చ‌క్క‌గా నాణ్య‌మైన ఆహారాన్ని తింటారని చెప్పారు. ముఖ్యంగా కొత్త హాలు ప్రాంతంలో అధికంగా హాస్పిటల్స్‌ ఉన్నాయని, వాటిని వచ్చే వేలాదిమందికి అన్నా క్యాంటీన్ల ద్వారా కడుపు నిండుతుందన్నారు. ఇక్కడ ఇచ్చే క్వాలిటీ ఫుడ్‌ బయట హోటళ్లలో దాదాపు 150 రూపాయలు పడుతుందన్నారు. అలాంటి భోజనాన్ని కేవలం 5 రూపాయలకే అందిస్తున్నారని చెప్పారు.

పేదల కడుపు నింపడం అనే ఎన్టీఆర్‌ ఆశయాల నుంచి అన్నా క్యాంటీన్లు రూపుదిద్దుకున్నాయన్నారు. 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని కూడా ఎన్టీఆర్‌ తీసుకువచ్చారన్నారు. ఆ ఆశయాలను నారా చంద్రబాబు ఆచరణలో పెట్టారని చెప్పారు. ఇక ఇంత శుచి, శుభ్రత గల ఆహారాన్ని సరఫరా చేస్తున్న హరేకృష్ణ ఫౌండేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా విలువైనవని గుర్తు చేశారు. అన్నా క్యాంటీన్ల సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు.