బడ్జెట్ ప్రవేశపెట్టక పోవడంపై సీఎం క్లారిటీ 

అమరావతి, మహానాడు :  ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆ కారణంగానే ప్రస్తుతం రాష్ట్రంలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టలేకపోతున్నామని చంద్రబాబు తెలిపారు. అందుకే కాస్త సమయం తీసుకొని బడ్జెట్ ప్రవేశ పెడతామని అన్నారు. కనీసం రెండు నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని చెప్పారు.

రాష్ట్ర బడ్జెట్ అంశంపై చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. పీవీ నరసింహా రావు ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టిన సమయంలో దేశంలో పెను మార్పులు సంభవించాయని గుర్తు చేశారు. అదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో విజన్‌ 2020 తయారు చేసి, దానికి అనుగుణంగా పని చేశామని చెప్పారు. ఆ రోజుల్లోనే అభివృద్ధి ప్రారంభించామని గుర్తు చేశారు.

అలా ఐటీ రంగానికి బాగా ప్రాధాన్యం ఇచ్చామని, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో వివిధ రంగాల్లో చాలా ముందుకు వచ్చామని చెప్పారు. ఇవాళ తెలుగు వాళ్లు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కనిపించే పరిస్థితి వచ్చింది. వికసిత్‌ భారత్‌ 2047కు ప్రపంచంలోనే భారత్‌ మొదటి లేదా రెండో స్థానానికి వస్తుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.