ఏపీపీఎస్‌సీపై కూటమి సర్కారు నిర్లక్ష్యం!

– ఏపీసీసీ చీఫ్‌ వైస్‌ఎస్‌ షర్మిలా రెడ్డి విమర్శ

విజయవాడ, మహానాడు: ఏపీపీఎస్‌సీపై కూటమి సర్కారు నిర్లక్ష్యం వహిస్తోంది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది.. ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు నాలుగు నెలలుగా చైర్మన్ లేకపోవడం సిగ్గుచేటు. దేశ చరిత్రలో ఇది తొలిసారి. మీ ప్రక్షాళన రాజకీయాలకు నిరుద్యోగులను బలి చేస్తున్నారని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో ఏమన్నారంటే.. శ్వేతపత్రాల మీద పెట్టిన శ్రద్ధ..కమీషన్ బలోపేతంపై పెట్టలేదు. చైర్మన్ నియామకం జరగక కొత్త నోటిఫికేషన్లు లేవు. విడుదలైన వాటికి పరీక్షల నిర్వహణ లేదు. వాయిదా వేసిన గ్రూప్ 1, గ్రూప్ 2, లాంటి పరీక్షలను మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు.

ఏపీపీఎస్‌సీ పరిధిలో 21 రకాల పరీక్షలు పెండింగ్ పడ్డాయంటే … ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. తక్షణం ఏపీపీఎస్‌సీ చైర్మన్ ను నియమించండి. అనంతరం వాయిదా వేసిన పరీక్షలతో పాటు, విడుదలైన నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకటన చేయించండి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉండి, కమీషన్ భర్తీ చేయాల్సిన ఒక లక్ష పోస్టులకు కొత్తగా అనుమతి ఇవ్వాలని, ఆందోళనలో ఉన్న నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.