Mahanaadu-Logo-PNG-Large

ఇదే బుడ్డోళ్ల బువ్వ..!

అంగన్ వాడీల్లో కలెక్టర్ అకస్మిక తనిఖీ
శభాష్.. కలెక్టర్ బాలాజీ 
(బహదూర్)

విజయవాడ , మహానాడు: గూడూరు మండలంలో పటాన్ పేట, జమ్మిరామరాజుపాలెం  గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పటాన్ పేట, రామరాజుపాలెం అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ చిన్నారుల హాజరు పట్టి పరిశీలించారు, పిల్లల బరువు, ఎత్తు నమోదు రిజిస్టర్ పరిశీలించి ఒకరిద్దరు చిన్నారుల బరువు స్వయంగా పరిశీలించారు. ఈరోజు  మెనూలో చిన్నారులకు అన్నం, ఉడికించిన గుడ్డు, ఆకుకూర పప్పు అందించారు. పాలు, గుడ్లు వంటి ఆహార పదార్థాల స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. పిల్లల శారీరక ఎదుగుదలకు పిల్లల బరువు ఎత్తు వ్యాక్సినేషన్ నమోదు రిజిస్టర్లు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పిల్లల్లో ఎదుగుదల గ్రోత్ రిజిస్టర్లో ప్రతి నెల 5వ తేదీ లోగా నమోదు చేయాలన్నారు.

అంగన్ వాడీ కేంద్రాల్లో తనిఖీ

పటాన్ పేట, రామరాజుపాలెం అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణీలు, బాలింతల ఇళ్లను  కలెక్టర్ సందర్శించారు.  పాలు, గుడ్లు, ఖర్జూర, నూనె, బియ్యం, పప్పు సక్రమంగా ఇస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు.  రామరాజుపాలెం కేంద్రంలో గర్భిణీలు,  బాలింతల రిజిస్టర్ లేకపోవడంతో  కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో రిజిస్టర్లు సరిగా నిర్వహించాలని ఆదేశించారు. గర్భిణీలకు హిమోగ్లోబిన్  శాతం తక్కువగా ఉన్నప్పుడు ఏఎన్ఎం,  అంగన్వాడి టీచర్ సంయుక్తంగా గర్భిణీ ఇంటికి వెళ్లి ఐరన్  మాత్రలు అందించాలని,  ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం తీసుకునేలా చూడాలని, ఆహార నియమాలు సూచనలు చేసి హిమోగ్లోబిన్  శాతం పెరిగేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.

పిల్లలతో కలిసి  భోజనం

అనంతరం జమ్మిరామరాజుపాలెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూశారు. ఈరోజు మెనూలో అన్నం, గోంగూర- పప్పు, చిక్కి, ఉడికించిన గుడ్డు విద్యార్థులకు అందించారు.  రెండవ తరగతి విద్యార్థి అభయ్ తేజతో చిన్న చిన్న కూడికలు ఇచ్చి  చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్  ఎస్. సువర్ణ, సీడీపీఓ గ్లోరీ, సూపర్ వైజర్లు ఉషశ్రీ, రేవతి, ఉప విద్యాశాఖ అధికారి శేఖర్ సింగ్, మార్క్ ఫెడ్  డీఎం  మురళీ కిషోర్, తాసీల్దారు శాంతి మధ్యాహ్న భోజన పథకం ఏడీ మనోహర్ నాయక్ పాల్గొన్నారు.