వెంకట శివ సాయి పిల్మ్స్ పతాకంపై మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ముత్యాల రామదాసు గారు మరియు నున్నా కుమారి గారు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి”. నూతన తారలు రవితేజ నున్నా హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా నటించారు. యువ ప్రతిభావంతులు కలిసి రూపొందిస్తున్న “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు విశేష స్పందన లభించింది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. హైదరాబాద్ లోని ‘రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది.
ఈ తరం ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని కలిగిస్తుందని చిత్ర బృందం ముందునుంచి చెబుతున్నట్టుగానే “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” ట్రైలర్ ఎంతో వైవిధ్యంగా ఉంది. లవ్, కామెడీ, సస్పెన్స్ వంటి అంశాలతో రూపొందిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పల్లెటూరు నేపథ్యంలో సాగే హాస్య సన్నివేశాలతో వినోదభరితంగా ట్రైలర్ ప్రారంభమైంది. నాయికా నాయకుల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు మెప్పించాయి. సాఫీగా సాగిపోతున్న ట్రైలర్ కథానాయిక హత్యతో ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. ఆమెను కథానాయకుడే చంపాడని, పోలీసులు అతని కోసం వెతుకుతుంటారు. అసలు రాజు గారి అమ్మాయి ఎలా చనిపోయింది? నాయుడు గారి అబ్బాయే ఆమెను హత్య చేశాడా? హత్యకు కారణమేంటి? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ ట్రైలర్ ను ముగించిన తీరు కట్టిపడేసింది.
ఈ సందర్భంగా దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారు మాడ్లాడుతూ.. “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి అనేది అందరికీ బాగా కనెక్ట్ అయ్యే టైటిల్. విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో దర్శకుడిగా సత్యరాజ్ మొదటి సినిమా చేశాడు. సినిమాలో కమర్షియల్ అంశాలు దండిగా ఉన్నాయి. సత్యరాజ్ కి ఆల్ ది బెస్ట్. అలాగే ముత్యాల రామదాసు గారు ఛాంబర్ లోనూ, కౌన్సిల్ లోనూ అనేక పదవుల్లో సేవలు అందించారు. చిన్న సినిమాలకు, నిర్మాతలకు ఎప్పుడూ అండగా ఉంటుంటారు. ముత్యాల రామదాసు నేతృత్వంలో రూపొందిన ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నాను. సాలూరి రాజేశ్వరరావు గారి మనవడు రోషన్ సాలూరి మంచి సంగీతం అందించాడు. అందుకే ఆదిత్య సంస్థ పాటలను విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. హీరో రవితేజ నున్నా ట్రైలర్ లో బాగా చేశాడు. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తున్నాడు. హీరోయిన్ నేహ కూడా ఎటువంటి బెరుకు లేకుండా చాలా బాగా చేసింది. ఈ చిత్రం ఘన విజయం సాధించి.. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.