నష్టపోయిన ప్రతి ఇంటికీ నష్టపరిహారం

• వరద నష్టం అంచనా వేయటానికి మొత్తం 1,700 ఎన్యుమరేషన్ బృందాల ఏర్పాటు
• నష్టం అంచనా నమోదుకు ప్రత్యేక యాప్‌
• త్వరితగతిన శానిటేషన్ ప్రక్రియ పూర్తికి చర్యలు
• ప్రజలు, పంట దెబ్బతిన్న రైతులు ఎవరూ అధైర్యపడవద్దు, ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుంది
• ప్రజలకు భరోసా కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నాం
• విపత్కర పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు అవలంభిస్తున్న విధానాలు, వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా హర్షం
• బురదను తొలగించే పనిలో ప్రభుత్వం ఉంటే కొందరు బురదజల్లేలా విమర్శలు చేయడం సరికాదు
• రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవలంభిస్తున్న విధానాలు, వ్యవహరిస్తున్న తీరును ప్రశంసిస్తూ జాతీయస్థాయిలో చర్చ జరుగుతోందని రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ గత 9 రోజులుగా విజయవాడ చరిత్రలో ఎన్నడూ చూడని ఉపద్రవం ముంచుకొచ్చిందన్నారు. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం తర్వాత రికార్డు స్థాయిలో వరదలు రావడం జరిగిందని, ఇలాంటి విపత్కర పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొంటోందన్నారు.

ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడంలో వయసు, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా బస్సులోనే ఉంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిస్తున్న చొరవ, కృషి, పనితీరు భవిష్యత్ తరాలకు, నాలాంటి ప్రజాప్రతినిధులకు ఆదర్శమని కొనియాడారు. వరదల నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికార, పార్టీ యంత్రాంగం, సచివాలయ సిబ్బంది ఇలా ప్రతి ఒక్కరూ నిరంతరం పర్యవేక్షిస్తూ సమస్య పరిష్కారం దిశగా పాటుపడుతున్నారన్నారు.

ఒకవైపు గత వారం రోజులుగా లోతట్టు ప్రాంతాల్లో నీరు ఉన్న పరిస్థితి..మరో వైపు అల్పపడీన ప్రభావంతో మళ్లీ వర్షాలు పడుతున్నాయన్న వార్తలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.

సహాయక కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సాయం అందడంలో ఏవైనా తప్పులు ఉంటే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అందరికీ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆహారం వృథా అయినా ఫర్వాలేదు కానీ బాధిత ప్రజలందరికీ సాయం అందాలన్నదే తమ తాపత్రయం అన్నారు. రోజుకు 6 నుండి 8 లక్షల అల్పాహారం, మధ్యాహ్నా, రాత్రి భోజనం ప్యాకెట్లు బాధితులకు అందిస్తున్నామని వివరించారు. బోట్లు, వాహనాలు, యంత్రాంగం వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా చేస్తున్నామన్నారు. కొన్ని చోట్ల హెలికాఫ్టర్ల ద్వారా బాధితులకు ఆహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు భరోసా కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నామని స్పష్టం చేశారు.

వర్షాల నేపథ్యంలో విష జ్వరాలు ప్రబలే అవకాశముండటంతో ప్రభుత్వం ముందే అప్రమత్తమై 4,5 వేల మంది సిబ్బందితో శానిటేషన్ కార్యక్రమాలు నిరంతరంగా చేపడుతుందన్నారు. దాదాపు 100-120 ఫైర్ ఇంజిన్లు, పంపులతో ఎప్పటికప్పుడు రోడ్లు, బాధితుల గృహాల్లో బురద తొలగించి శుభ్రం చేస్తున్నామన్నారు. బురదను తొలగించే పనిలో ప్రభుత్వం ఉంటే కొందరు ప్రభుత్వంపై బురదజల్లేలా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిర్మాణాత్మక సలహాలు, సూచనలు అందివ్వాలని, విషం కక్కే వార్తలతో తమ పత్రికల్లో విష ప్రచారాలు చేయడం తగదన్నారు. ప్రజాప్రతినిధులతో మాట్లాడటానికి ఇబ్బంది ఉంటే చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులకు సమస్యలు చెప్పవచ్చని సూచించారు.

గత ప్రభుత్వానికి కాలువలో వెలికి తీసిన మట్టిని అమ్ముకోవడంలో ఉన్నంత శ్రద్ధ అదే కాలువల రిపేర్ కు నిధులు కేటాయించడంలో లేదని ఆరోపించారు. గత ప్రభుత్వం కాలువల్లో మట్టి తవ్వకుని అమ్ముకున్నారే తప్ప డ్రైనేజీ కాలువలకు మరమ్మతులు చేద్దామని, గండ్లు పూడుద్దామని ఆలోచించలేదన్నారు. కనీసం కబ్జాకు గురవుతున్నా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ కోసం ఎలాంటి ఆలోచన చేయలేదన్నారు. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

ఇప్పుడిప్పుడే వరద ఉధృతి తగ్గుతోందని త్వరితగతిన శానిటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. శానిటేషన్ పనితీరును ఈ సందర్భంగా ప్రజలు మెచ్చుకున్నారు. తాను కృష్ణలంక ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రజలు సహాయక చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. బాధితులకు ప్రభుత్వంపై నమ్మకముందన్నారు.

వరదలు, భారీ వర్షాల వల్ల నష్టపోయిన వివరాలను వెల్లడిస్తామన్నారు. వరద నష్టం అంచనా వేయటానికి మొత్తం 1700 ఎన్యూమరేషన్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డిప్యూటీ తహసిల్దార్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్, వార్డు అసిస్టెంట్, పోలీసుతో కూడిన బృందం ఎన్యూమరేషన్ ప్రక్రియలో పాల్గొంటుందన్నారు. ప్రతి సచివాలయంలో ఒక ఐఏఎస్ అధికారి, జిల్లా స్థాయి అధికారి, స్థానిక ప్రజా ప్రతినిధి పర్యవేక్షిస్తారన్నారు. ప్రాథమికంగా 2,50,000 ఇళ్లు దెబ్బతిన్నాయని, నష్టం వాటిల్లిందని అంచనా వేశామన్నారు. నష్టం అంచనా నమోదుకు అధికారులు ప్రత్యేక యాప్‌ రూపొందించారని తెలిపారు.

ఎన్యుమరేషన్ సమయంలో ఇంట్లో ఎవరూ లేకుంటే తర్వాత అయినా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్యూమరేషన్ తమ గృహం, పేరు రాకపోతే స్థానిక ప్రజాప్రతినిధిని కలవాలని సూచించారు. వివరాలు సేకరించి యాప్ లో నష్టపోయిన ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేస్తామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన రైతాంగం తీవ్రంగా నష్టపోవడం బాధ కలిగించే అంశమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందన్నారు. గన్నవరం, నూజివీడు, ముదినేపల్లి లాంటి ప్రాంతాల్లో పొలాలు, గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయని, సంబంధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే బాధ్యతతో వ్యవహరించకుండా కొందరు బురద చల్లుతున్నారని మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు