విద్యార్థుల ఫిర్యాదుతో ఉపాధ్యాయునిపై విచారణ
తెనాలి, మహానాడు: పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు పై జిల్లా కలెక్టర్ కు విద్యార్థులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంగళవారం అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థినులు షేక్ యాస్మిన్, బి.అవంతిక, ఎన్ సుప్రజ కలిసి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నేరుగా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
తెలుగు ఉపాధ్యాయులు నాగేశ్వరరావు బోధన సరి లేదని, ఆయనను బదిలీ చేయాలని వివరించారు. విద్యార్థినుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ విచారణకు జిల్లా విద్యాధికారిని ఆదేశించగా, ఆమె ఆదేశాల మేరకు తెనాలి జిల్లా ఉప వైద్యాధికారిణి శాంతకుమారి, మండల విద్యాధికారి డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ పాఠశాలలో విచారణ చేపట్టారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడగా, వారు ముక్తకంఠంతో తెలుగు ఉపాధ్యాయుడిని బదిలీ చేయాల్సిందేనని కోరారు. తెలుగు బోధనలో లిఖితపూర్వకంగా ఆయన చేసిన తప్పిదాలను వెల్లడించారు.
దీంతో స్పందించిన అధికారులు నాగేశ్వరరావు ను జిల్లా విద్యాధికారి కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులలో ఒకరిని తెలుగు బోధించేందుకు సర్దుబాటు చేశారు. విద్యార్థుల సమస్యపై సకాలంలో స్పందించని హెడ్మాస్టర్ సరళను కూడా హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సమస్యలపై ప్రధానోపాధ్యాయుల దృష్టికి వచ్చిన వెంటనే స్పందించాలని, ఇంకా పాఠశాలల్లో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉంటే అధికారుల దృష్టికి తేవచ్చని వారు స్పష్టం చేశారు.
తెలుగు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ…
తనకు గతంలో పెద్ద ప్రమాదం జరగడం వల్ల అనారోగ్య సమస్యలకు గురయ్యానని, అప్పటి నుంచి తన మాట నంగిగా వస్తుందని తెలుగు నిదానంగా విద్యార్థులకు బోధన చేస్తున్నానని తాను నిదానంగా చెప్పడం వల్ల విద్యార్థులకు అర్థం కావడం లేదని తన పై ఫిర్యాదు చేశారనీ తెలిపారు.