అంగన్వాడీ కేంద్రాలతో పిల్లలక సంపూర్ణ ఆరోగ్యం

– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, మహానాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పిల్లల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు, ఈ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి బిడ్డకు పౌష్టికాహారం అందేలా అందరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ దర్శి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఈ మేరకు ఆమె మండల కేంద్రమైన దొనకొండలో శనివారం ఐసిడిఎస్ ప్రాజెక్టు వారు ఏర్పాటు చేసిన పౌష్టికాహర వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏ సంకల్పంతో అయితే భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేస్తుందో అది సక్రమంగా వారికి అందే విధంగా బాధ్యత తీసుకోవాలన్నారు.

పిల్లల తల్లిదండ్రులు చైతన్యంతో ప్రభుత్వం అందజేసే పౌష్టికాహారాన్ని సకాలంలో అందేందుకు సహకరించాలని కోరారు. అధికారులు అప్రమత్తతో ఉండి సకాలంలో సరైన సమయంలో పిల్లలకు ప్రభుత్వం అందజేసే కోడిగుడ్లు, చిక్కిచెక్క లతో పాటు ఇలా అనేక పౌష్టికాహార వస్తువులను వారికి అందించాల్సిన గురుతర బాధ్యత మనపై ఉందన్నారు. నేను కూడా మీతో పాటు పౌష్టికాహారం అందించే కార్యక్రమం లో పాలు పంచుకుంటానని గొట్టిపాటి లక్ష్మి మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో భారతి, తదితరులు పాల్గొన్నారు.