తిరుపతి లడ్డూ, ప్రసాదాలలో జంతులు నూనె పై పూర్తి విచారణ చేయండి

– దోషులను కఠినంగా శిక్షించండి

దేవ దేవుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు ఇచ్చే లడ్డూ, ప్రసాదాలలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు పదార్థాలను వాడారన్న ఆరోపణలపై పూర్తి విచారణ జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు.

సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డూల నాణ్యతను దెబ్బ తీసి, ప్రసాదాలను కూడా వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందంటూ లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వాడారన్న ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి పెట్టాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు తిరుపతి వెంకన్నను దర్శించుకుంటారని, ఇలాంటి ఘాతుకానికి పాల్పడిన వారు శిక్షకు పూర్తిగా అర్హులని చెప్పారు.

హిందూ మనోభావాలతో పాటు సర్వమతాల మనోభావాలను దెబ్బ తీసిన ఇలాంటి చర్యలపై త్వరితగతిన విచారణ అవసరం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరుపతి పవిత్రతకు భంగం కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, కొత్త టిటిడి బోర్డు నియామకంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు.