సీఎం రేవంత్ రెడ్డి దళితులకు క్షమాపణ చెప్పాలి
కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను దేవుడి సాక్షిగా,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఘోరంగా అవమానించి,కాంగ్రెస్ తన నిజ స్వరూపం బయటపెట్టిందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఇది యావత్ దళిత జాతిని అవమానించినట్లుగా బీఎస్పీ భావిస్తుందని కాంగ్రెస్ ను నిందిస్తూ సామాజిక మాద్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సోమవారం ఓ వీడియోను షేర్ చేశారు.
నిత్యం ఇందిరమ్మ రాజ్యం,ప్రజా పాలన,ఆరు గ్యారంటీలంటూ ఉదరగొడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ పాపం చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను అవమానించారని ప్రశ్నించారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులతో పాటు సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లను గౌరవంగా ఎత్తయిన కుర్చీలపై కూర్చోబెట్టి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అవమానకరంగా తక్కువ ఎత్తయిన పీఠంపై కూర్చోబెట్టారని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పేద ప్రజలంటే గౌరవం లేదన్న ఆయన, జన్వాడలో దళితులపై దాడి జరిగితే ఖండించలేదని విమర్శించారు. గురుకులంలో పేద వర్గాలకు చెందిన విద్యార్థులు వరుస ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి పరామర్శించలేదన్న ఆయన, ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పేద వర్గాలపై ఓట్ల కోసం కపట ప్రేమ ఒలకబోస్తుంది తప్ప,నిజంగా దళితులపై ప్రేమలేదని, విద్వేషం ఉందని ఆరోపించారు. అధికారిక పర్యటనలో ప్రోటోకాల్ పాటించకుండా దళితులను అవమానించడం దారుణమన్నారు.