– బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆరోపణ
హైదరాబాద్, మహానాడు: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను వెన్నుపోటు పొడిచేందుకే కుల గణన సర్వే పేరిట.. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చేపడుతోందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ప్రయోజనాలను రద్దు చేయడానికి… వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను రద్దు చేయడానికే ఈ సర్వే చేపడుతున్నట్టుగా అనుమానం కలుగుతోందని విమర్శించారు. ప్రజల వ్యక్తిగత వివరాలు, గోప్యతకు సంబంధించి సర్వే ప్రొఫార్మాలో అడగటంపైనా కాసం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఎన్నికల వేళ రాహుల్ గాంధీ హడావుడిగా తెలంగాణకు వచ్చి, ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ఆయన ఆరోపించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాసం వెంకటేశ్వర్లు మాట్లాడారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి హడావుడిగా వచ్చి కుల గణన సర్వేకు సంబంధించి మేధావుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకునేందుకు విచిత్రమైన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ తెలంగాణకు ఆదరాబాదరాగా వచ్చి మేధావుల సదస్సు పేరుతో సమావేశం నిర్వహించడం చూస్తుంటే తెలంగాణ ప్రజలను మోసం చేసేలా ఆడుతున్న మరో నాటకంగానే కనపడుతోంది. తెలంగాణ ప్రజలపై, బీసీలపై రాహుల్ గాంధీకి నిజంగా చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 2 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి. మరి ఆ విషయంలో జరిగిన లోపాలపై ఎందుకు సమీక్ష చేయడం లేదు..? ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కనీసం రెండు అసెంబ్లీ సీట్లు బీసీల కోసం కేటాయించని కాంగ్రెస్ ప్రభుత్వం.. మళ్లీ కార్పొరేషన్ చైర్మన్ల నియామకాల్లో బీసీలకు సముచితమైన ప్రాధాన్యత ఇస్తామని హామీలు గుప్పించిందని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ తో పాటు తదితర నాయకులు పాల్గొన్నారు.