-బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్, మహానాడు : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ నేతలు జి.దేవి ప్రసాద్, మన్నె గోవర్ధన్ రెడ్డి, పల్లె రవికుమార్, రాంబాబు నాయక్ లు అన్నారు. తెలంగాణ భవన్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రావడానికి అశోక్ నగర్ కోచింగ్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొట్టారన్నారు. మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీ వేశారు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు 1:50 అభ్యర్థులను క్వాలిఫై చేశారు. 1: 100 అని ఎన్నికల్లో హామీ ఇచ్చి వైదొలిగారు. జాబ్ కేలండర్ అని దాని మాట మరిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను వంచించింది. నిరుద్యోగుల ఉసురు తగలకుండా చూసుకోండి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నారు గ్రూప్ 1లో కేసీఆర్ తెచ్చిన విధానం మార్చలేరా?
తక్షణమే 25 వేల పొస్టులతో మెగా డీఎస్సీ వేయాలి. కాంగ్రెస్ గెలుపు కోసం నిరుద్యోగులు ఇంటింటికీ తిరిగారు. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారిని నిర్బంధిస్తుంది. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకిచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఏడు నెలలుగా ఉద్యోగులు డీఏలకు నోచుకోలేదు. రిటైరయిన ఉద్యోగుల బెనిఫిట్స్ గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏడు నెలల పాలన ప్రజల పాలిట సాడే సాత్ పాలనగా మారిందని ఎద్దేవా చేశారు.
ఏ ఒక్క వర్గాన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం సంతృప్తిపరచలేదు. విభజన చట్టం హామీలపై కాంగ్రెస్ నేతలు కేసీఆర్ పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఆంద్రాలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను కేసీఆర్ హయాంలో చాలామందిని ఇక్కడకు రప్పించాం. ఇంకొంత మంది ఉన్నారు. కొందరు ఏపీ అధికారులను సచివాలయంలో నియమించి తెలంగాణ ఉద్యోగులపై పెత్తనం చూస్తే ఊరుకునేది లేదు. నిరుద్యోగులు, ఉద్యోగుల డిమాండ్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి లేదంటే ఉద్యమాలు ఉధృతమవుతాయన్నారు.
బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ మాట్లాడుతూ… నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా మోసం చేస్తోంది. గ్రూప్1 ప్రిలిమ్స్ ఫలితాల విషయంలో నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పక్కన బెట్టడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగుల నాయకులు యోధులుగా కనిపించారు. ఇపుడు వారు కాంగ్రెస్ కు పనికిరాని వారుగా తయారయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి నిరుద్యోగ ఉద్యమకారిణి సిందూరెడ్డిని శంఖినిగా పేర్కొనడం మూర్ఖత్వం.
సింధూరెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలి. 1999 సుప్రీం కోర్టు తీర్పు సాకుగా చెప్పి గ్రూప్1, 2 నోటిఫికేషన్లు మార్చడం కుదరదు అని ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోంది. నిరుద్యోగులను ఏమార్చే ప్రయత్నం చేయడం సమంజసం కాదు. డీఎస్సీలో పోస్టుల సంఖ్యను తక్షణమే పెంచాలి. గురుకుల టీచర్ల నియామకంలో బాధితులకు న్యాయం చేయాలి. నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా వారికి బీఆర్ఎస్ రక్షణ కవచంలా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.