– మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్, మహానాడు: కేసీఆర్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్న కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగాల నియామకాలపై పూర్తి అవగాహన లేక పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి ఇచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 9 నెలల్లో 50 వేల పైచిలుకు ఉద్యోగాలు నియమాకాలు పూర్తయినట్టు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గొప్పలు చెప్పుకుంటున్నారని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు అబద్దాల ఆడుతుంటే వాటికీ పీసీసీ అధ్యక్షులు వంత పాడుతున్నారని, దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 9 నెలల్లో ఇచ్చిన ఉద్యోగాలకు ఏ తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు, వాటికి రాత పరీక్షలు ఎప్పుడు నిర్వహించారు.. వాటి ఫలితాలు ఎప్పుడు విడుదల చేశారు.. నియామక పత్రాలు ఎప్పుడు ఇచ్చారో రాష్ట్ర ప్రజలను తెలపాలని కొప్పుల ఈశ్వర్ సవాల్ చేశారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ నిరుద్యోగులకు అనేక వాగ్దానాలు చేసిందని, అయితే వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పూర్తి చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానాలను మహేష్ కుమార్ గౌడ్ మరిచి పోతే ఎలా అన్నారు. గత 10 ఏళ్ళలో ప్రభుత్వ రంగంలో 2 లక్షల 03 వేల ఉద్యోగాలకు మా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, ఇందులో 1 లక్ష 60 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ లో 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఉద్యోగ నియామకాల పై చాలా సార్లు కేటీఆర్ వివరించారని కొప్పుల ఈశ్వర్ గుర్తుచేశారు.