-ఎంపీ ఎన్నికలకు, రేవంత్ హామీలకు సంబంధం ఉందా?
-మేడ్చల్లో కాంగ్రెస్కు ప్రజాబలం లేదు
-త్యాగధనులకు, స్వార్థ పరులకు మధ్య పోటీ ఇది
-సుస్థిర పాలన కోసం మోదీని ఆశీర్వదించండి
-బీజేపీ నేత ఈటెల రాజేందర్
మేడ్చల్, మహానాడు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మోకాలికి, బోడగుండుకు ముడిపెట్టి మాట్లాడుతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. మేడ్చల్లో మంగళవారం మాజీ ఎంపీపీ చంద్రశేఖర్, ఈశ్వర్ గౌడ్, పరమేష్ యాదవ్, మహేష్ యాదవ్, పవన్ యాదవ్, రామచందర్, వినయ్ జెన్, పవన్, సూరి, కస్తూరి నాగులు, యోగి తదితరులు ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడారు. మేడ్చల్లో కాంగ్రెస్కు ప్రజాబలం లేదని, దింపుడు కల్లం ఆశతో ఒక్కో నాయకుడిని లక్ష నుంచి రూ.5 కోట్ల వరకు వెలకట్టి కొనుక్కుంటున్న పరిస్థితి ఉందన్నారు. ప్రజాస్వామ్యం బతికించడం కోసం బీజేపీలో చేరుతున్న వారు ఒక వైపు ఉంటే, ప్రలోభాలకు, డబ్బులు, బిల్లులు, పదవుల కోసం ఆశపడి కాంగ్రెస్లో చేరుతున్న వారు మరో వైపు ఉన్నారని విమర్శించారు. త్యాగధనులని, స్వార్థపరులకు మధ్య పోటీ అన్నారు. మోదీ పేదింటి బిడ్డ..అందుకే 4 కోట్ల మందికి ఇళ్లు కట్టించారు. ప్రగల్భాలు పలికిన కేసీఆర్ పేదల కళ్లలో మట్టికొట్టారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుచేయకపోతే నేరుగా అమలు చేసే బాధ్యత తీసుకుంటామని మోదీ కొత్త నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే కేంద్రం ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటుందని తెలిపారు.
కాంగ్రెస్కు ఓటువేస్తే జీరో
ఇంకో ఐదేళ్లు ఉచితంగా రేషన్ ఇస్తామని మోదీ ప్రకటించారు. వ్యాపారం చేసుకునే వారికి రూ.20 లక్షల రుణాలు ఇవ్వనున్నారు. విశ్వకర్మ పథకం కింద 17 వృత్తుల్లో పనిచేసే వారికి 20 లక్షల వరకు అందిస్తున్నారు. కాంగ్రెస్ గెలవడం కోసం అనేక హామీలు ఇచ్చింది. ప్రతి మహిళకు రూ.2500, లక్ష రూపాయలతో పాటు కళ్యాణలక్ష్మికి తులం బంగారం, రైతుకు రూ.15 వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేయలేక పోయారు. మరి రేవంత్ రూ.2 లక్షల రుణమాఫీ కోసం రూ.34 వేల కోట్లు ఒకే సంవత్సరంలో ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. జీరో కరెంటు బిల్లు అమలైందా? ఇవన్నీ అమలు చేయమంటే కేసీఆర్ చిప్ప చేతికిచ్చి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు రేవంత్ మళ్లీ కొత్త అవతారం ఎత్తారు. 17 సీట్లు గెలిపిస్తే అమలు చేస్తా అంటున్నారు. మనం తెలంగాణలో గెలిపిస్తే 40 సీట్లున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? మోకాలికి బోడిగుండుకు ముడి పెట్టి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికలకు, రేవంత్ ఇచ్చిన హామీలకు ఏమన్నా సంబంధం ఉందా? అని ప్రశ్నిం చారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే దాని విలువ జీరో అని, పేదల బతుకులు మారాలన్నా, సుస్థిర పాలన కోసం బీజేపీకి ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు.