– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ, మహానాడు: నాడు బ్రిటిష్ వారిపై నిస్వార్థంగా పోరాడి, స్వేచ్ఛయే లక్ష్యంగా అలుపెరగని సుదీర్ఘ సమరం చేసి, దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. ఇప్పుడు దేశం కోసం రిమోట్ కంట్రోల్ తో నడుస్తున్న మోదీ సర్కారుపై మరొక పోరాటం సాగిస్తోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. ఈరోజు మరోసారి ప్రజాధనాన్ని లూటీ చేస్తూ, ప్రజల ఆస్తులను విచక్షణారహితంగా దోచుకుంటున్న కార్పొరేట్ జలగలు.. వారిని పెంచిపోషిస్తున్నది మోదీ సర్కార్ అని విమర్శించారు.
సెబీ చీఫ్ మాధబి పూరీ పై వచ్చిన తీవ్ర ఆరోపణలపై విచారణ జరపకుండా, అదానీ పెట్టుబడులకు సంబంధించి ఆమె పాత్ర గురించి యావత్ దేశం నిరసన తెలుపుతున్న వేళ, నిమ్మకు నీరెత్తకుండా, మౌనం వహిస్తూ, పైపెచ్చు అటు ఆమెను, ఇటు అదానిని కాపాడే కుటిల ప్రయత్నాలను చేస్తున్న మోదీ సర్కారు దివాళాకోరుతనాన్ని నిరసిస్తూ, ఇండియా కూటమి నేడు దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ఎదుట ధర్నాలు నిర్వహిస్తోంది… దేశంలోని 10 కోట్ల మంది పెట్టుబడిదారుల ఆందోళనను ఏమాత్రం పట్టించుకోకుండా, నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ సర్కారును నిలదీస్తూ, మాదబీ పూరి విషయంలో వెనువెంటనే జేపీసీ వేసి, సిబిఐ, ఈడీ సమగ్ర విచారణకు ఆదేశించాలని, 140 కోట్ల ప్రజల తరపున కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
ఇటువంటి క్యాపిటలిస్టు రక్కసి ధోరణిని ప్రజలమీదకు రుద్దుతూ, ప్రభుత్వ సంస్థలను తన జేబుసంస్థలుగా మార్చి, కేవలం ప్రతిపక్షాల మీద కక్షపూరిత దాడులకు మాత్రమే వాటిని వాడుకునే మోదీ నియంత పాలనపై కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది. అదానీ లాభాలు మోదీ లాభాలుగా, అదానీ సంస్థల వృద్ధి, బీజేపీ వృద్ధిగా మారిన దారుణ పరిస్థితుల్లోకి దేశాన్ని నెట్టేశారు మోదీ. దీనిపై దర్యాప్తు ప్రారంభించడం ప్రభుత్వానికి నైతిక, వృత్తిపరమైన బాధ్యత. ఇంత తీవ్రమైన ఆరోపణపై మౌనం వహించి, మీ కార్పొరేట్ మిత్రులను కాపాడటానికి అన్ని కుటిల మార్గాలను వాడుకోవటం ఎంతో సిగ్గుచేటు అని షర్మిల దుయ్యబట్టారు.