హామీల అమల్లో చతికిలపడ్డ కాంగ్రెస్​!

– తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్​ రెడ్డి

హైదరాబాద్‌, మహానాడు: బీఆర్​ఎస్​ దోపిడీ విధానాన్ని ప్రజలు అరికట్టి, కాంగ్రెస్​ కు పట్టం కట్టబెడితే అధికారంలోకి వచ్చి యేడాది కాలం గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీని, హామీని నిలబెట్టుకోలేక చతికిలపడిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్​ పాలిత రాష్ట్రల్లో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు. అప్పు పుట్టడం లేదన్నారు. ఆ రాష్ట్రల్లో కూడా మోసపూరిత హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ప్రజలకు చుక్కలు చూపెడుతోందని కిషన్​ రెడ్డి మండిపడ్డారు. పొయ్యి మీద నుంచి పెనంపై పడ్డట్టు తెలంగాణ ప్రజల పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు, ఉద్యమాలకు బీజేపీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని జి.కిషన్​ రెడ్డి పిలుపునిచ్చారు.

బీజేపీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా గురువారం జరిగిన కార్యక్రమంలో కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధిక సభ్యులున్న పార్టీ బీజేపీయేనని తెలిపారు. ప్రతీ మూడేళ్ళకు ఒకమారు గ్రామస్థాయి నుంచి సంస్థాగత ఎన్నికలను నిర్వహించుకునే ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. పదేళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు చేసే పార్టీ బీజేపీ అన్నారు. తెలంగాణలో 31 లక్షల సభ్యత్వ సేకరణ పూర్తయిందన్నారు. 15వ తేదీ వరకు సభ్యత్వ సేకరణ చేపట్టాలన్నారు. జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో నిర్దేశించుకున్న సమయంలోపు లక్ష్యాలను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.

దేశంలో కుటుంబ పాలన
దేశంలో కుటుంబాల ఆధారంగా పార్టీలు నడుస్తున్నాయని కిషన్​ రెడ్డి విమర్శించారు. జమ్మూకశ్మీర్​ నుంచి మొదలు తమిళనాడు వరకూ కొడుకు, అల్లుడు, బిడ్డ ఇలాంటి విధానం కొనసాగుతోందన్నారు. ఈ విధానానికి బీజేపీ పూర్తి వ్యతిరేకమని ఇందుకు ప్రతీ ఒక్కరూ గర్వపడాలన్నారు.

గ్యారంటీలపై చేతులెత్తేసిన కాంగ్రెస్​
తెలంగాణలో బీఆర్​ఎస్​ అహంకార పూరితంగా పాలించిందని, దోపిడీ చేసిందని ప్రజలు భావించారని కిషన్‌ రెడ్డి అన్నారు. ఆ తరువాత కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చి యేడాది గడిచినా ఒక్క రేషన్​ కార్డు, పెన్షన్​ రూ. 4వేలు, గృహ నిర్మాణాలకు భూమిపూజ చేయలేదన్నారు. అప్పులు మాత్రం విపరీతంగా చేశారన్నారు. కేసీఆర్​ హయాంలో రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేస్తే, కాంగ్రెస్​ పార్టీ హయాంలో ఏ భూములను తాకట్టు పెట్టి అప్పు తీసుకోవాలనే చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ తరువాత బీజేపీ వైపు ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం బీజేపీ సంస్థాగత వ్యవస్థ ఉపిరిలాంటిందని కిషన్​ రెడ్డి పేర్కొన్నారు.

ప్రజల సమస్యపై నిలదీద్దాం..
గ్రామీణ, మండల, జిల్లా కమిటీలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవైపు సంస్థాగతంగా ముందుకు వెళుతూనే ప్రజల గ్యారంటీలు, హామీల వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, పోరాటలు, ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రైతాంగ, బడుగ బలహీన, నిరుద్యోగ విద్యారంగ, మహిళలు, నిరుపేదల సమస్యలపై బీజేపీ తరఫున ప్రజలకు అండగా నిలవాలని కిషన్​ రెడ్డి పిలుపునిచ్చారు.

ఒక్కరూపాయి భారం పడనీయని కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి సంబంధించి చివరి గింజ వరకూ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఎన్నివేల కోట్లయినా ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ఇక్కడి ప్రభుత్వం మధ్యవర్తులు, మిల్లర్లు, దళారీలతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఒక్కరూపాయి కూడా భారం కేంద్రం పడనీయదన్నారు.

ప్రతీనయా పైసా లెక్కపెట్టి ఇస్తుందన్నారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. సీఎం మాటలు కోటలు దాటుతాయే తప్ప పనులు మాత్రం కనిపించవన్నారు. తెలంగాణలో హామీలు అన్ని అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. మహారాష్ట్రకు వెళ్లి చెప్పుకుంటోందని ఆరోపించారు.

నాలుగేళ్లు ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధం కావాలి
కాంగ్రెస్​ పాలిత రాష్ట్రలన్నీ ఒకవైపు దివాళా తీసే పరిస్థితి ఉందన్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయని విమర్శించారు. అప్పులు పుట్టే పరిస్థితులు లేవన్నారు. వీటన్నింటిపై బీజేపీ పోరాటం చేయాలని కిషర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. సంస్థాగత సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వం, పోలింగ్​ బూత్​ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో ప్రతీఒక్కరూ పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే నాలుగేళ్ళపాటు ప్రజల పక్షాన నిలిచి పోరాడదామన్నారు.

రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలంటే ప్రజల పక్షాన పోరాడాలని పార్టీని పటిష్ఠం చేయాలని అన్నారు. బీఆర్​ఎస్​ పైన విశ్వాసం లేదని తేలిపోయిందని, కాంగ్రెస్​ పై ప్రజలకు ఆక్రోశం ఆగ్రహం ఉన్నాయని అన్నారు. ఈ పార్టీలను నిలదీయాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.