రాహుల్‌ గాంధీ హత్యకు కుట్ర!

– బీజేపీ తీవ్రవాదుల పార్టీ
– వన్ టౌన్ గాంధీ విగ్రహం వద్ద ఏపీసీసీ భారీ నిరసన
– అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ క్షమాపణ చెప్పాలి
– పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపణ డిమాండ్‌

విజయవాడ, మహానాడు: రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రతిపక్ష నేత… రాహుల్ గాంధీని చంపాలని బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు… ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తున్నా మోడీ, షాలు పట్టించుకోవడం లేదని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇదంతా వారి డైరెక్షన్ లోనే జరుగుతోంని, ఈ దుర్మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆమె అన్నారు. ఈ మేరకు బుధవారం వన్ టౌన్ గాంధీ విగ్రహం వద్ద ఏపీసీసీ భారీ నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో షర్మిలా పాల్గొని, మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే… ద్వేషపూరిత మాటలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ దేశంలో ఎవరు తీవ్రవాదులు? ఏది తీవ్రవాదం? ఈ దేశంలో అట్టడుగు వర్గాల వాళ్ళు 90 శాతం మంది ఉన్నారు. వాళ్ళకు అభివృద్ధి లో వాట లేదు అని చెప్పడం అని తీవ్రవాదమా? అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని చెప్పడం తీవ్రవాదమా? ఏది తీవ్రవాదమో బీజేపీ సమాధానం చెప్పాలి.

ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అన్ని కులాలను, మతాలను సమానంగా చూసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల హక్కుల కోసం పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ. అన్ని మతాలకు, కులాలను సమానంగా చూసింది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి నీచంగా బీజేపీ మాట్లాడుతోంది. రాహుల్ గాంధీని తీవ్రవాది అంటున్నారు. రాహుల్ అమ్మమ్మ, నాన్న ఇద్దరు తీవ్రవాదుల చేతుల్లో బలి అయ్యారు. ఈ విషయం బీజేపీకి తెలియదా? రాహుల్ గాంధీ ఈ దేశంలో ప్రేమను నింపిన నాయకుడు. రాహుల్ గాంధీ పేరు ఉచ్చరించే హక్కు బీజేపీకి లేదు. బీజేపీ అంటే మతతత్వ పార్టీ. బీజేపీ మత చిచ్చు పార్టీ. బీజేపీ తీవ్రవాదుల పార్టీ. మతాల మధ్య చిచ్చుపెట్టాలి..అందులో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ సిద్ధాంతం. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం బీజేపీ తీవ్రవాది పార్టీ అనడానికి నిదర్శనం కాదా? కేవలం అగ్ర వర్ణాలకు కొమ్ము కాయడం తీవ్రవాదం అనిపించుకోదా?

అణగారిన వర్గాలను తొక్కాలని బీజేపీ చూస్తుంది. ఈ దేశంలో రిజర్వేషన్లు గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు. బీజేపీ రాహుల్ గాంధీకి భయపడుతుంది. రాహుల్ పాదయాత్రతో ఈ దేశంలో ధైర్యం నింపాడు. బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ. బీజేపీ అంటే భారతీయ జూట పార్టీ
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించింది. ఈ దేశంలో బీజేపీ కి మించిన వేర్పాటు వాదుల పార్టీ ఇంకోటి ఉందా? మసీదుల మీద, చర్చ్ ల మీద, క్రిస్టియన్లు, ముస్లీంల మీద ఊచ కోత కోసిన టెర్రరిస్టు పార్టీ ఈ బీజేపీ కాదా? ముస్లీం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని చెప్పడం టెర్రరిజం అనరా? ఈ దేశంలో అగ్రవర్ణాల కొమ్ము గాస్తున్నది బీజేపీ కాదా ? కేవలం 10 శాతం మంది మీ తొత్తుల చేతుల్లోనే భారతీయ వ్యాపారం మొత్తం కేంద్రీకృతం కాలేదా?

కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి పోస్టుల్లో ఎంత మంది దళిత,గిరిజనులు ఉన్నారు? వెనుక బడిన విద్యార్థులకు స్కాలర్ షిప్స్ 40 శాతానికి ఎందుకు తగ్గించారు? ఓబీసీ విద్యార్థుల స్కాలర్ షిప్ లు ఎందుకు 15 శాతానికి తగ్గించారు? దళిత మహిళకు ప్రయోజనం చేకూర్చే కేంద్ర పథకాల నిధులను 20 శాతానికి ఎందుకు కోత పెట్టారు? 10 ఏళ్లుగా దేశ వ్యాప్తంగా దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు 15 నుంచి 32 శాతానికి ఎలా పెరిగాయి? వీటికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. బీజేపీని హెచ్చరిస్తున్నం… మర్యాదగా రాహుల్ గాంధీ కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.