ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును నీరుగార్చే కుట్ర

బీజేపీ నేత బండి సంజయ్‌

హైదరాబాద్‌, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. నేను ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుమ్కక్కై ఎదురుదాడి చేస్తున్నాయి. దీనికి అతిపెద్ద ఉదాహరణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు. ఈ కేసును నీరుగార్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. గతంలో డ్రగ్స్‌, మియాపూర్‌ భూములు, టీఎస్‌పీపీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు మాదిరిగానే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును మూసివేసే కుట్ర జరుగుతోందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ తతంగమంతా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ఇవన్నీ బయటకు రావడంతో కేసీఆర్‌ కుటుంబం కరీంనగర్‌లోని ఓ మంత్రితో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు.

కేసీఆర్‌ కుటుంబమిచ్చే సలహా సూచనలకు అనుగుణంగా సదరు మంత్రి పనిచేస్తున్నారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని నిందితుడు రాధాకిషన్‌రావు పోలీసుల విచారణలో వెల్లడిర చారు. ఒక అధికారి నా వద్దకు వచ్చి నాతో పాటు మా కుటుంబసభ్యులు, సిబ్బంది ఫోన్లను ట్యాపింగ్‌ చేశారని చెప్పారు. నేను వాడే సిమ్‌ కార్డును డూప్‌ సిమ్‌ తీసుకుని నా ఫోన్లన్నీ ట్యాప్‌ చేశారు. మా ఇంటి దగ్గర పెట్రోల్‌ బంక్‌ సమీపంలో, టెంపుల్‌ సమీపంలో వాహనాలను ఉంచి ఫోన్‌ ట్యాప్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుండే రాధాకిషన్‌రావు, ప్రభాకర్‌రావు కరీంనగర్‌లో మకాం వేసి మా ఫోన్లు ట్యాప్‌ చేశారు. రాధాకిషన్‌ రావు ప్రతిమ హోటల్‌లోని 314 రూంలో ఉంటూ (బిల్లులు చెల్లించకుండా) నా ఫోన్‌ ట్యాప్‌ చేశారు.

నాతోపాటు పెద్దపల్లి, రామగుండం కాంగ్రెస్‌ అభ్యర్థుల ఫోన్లను ట్యాప్‌ చేయడంతో వాళ్లు పైసలు పట్టుకున్నారు. ఇదంతా కేసీఆర్‌తో జిల్లా మంత్రి కుమ్కక్కై సాగించిన కుట్ర ఇది. ఫోన్‌ ట్యాపింగ్‌ అసలు నిందితుడు, ప్రభాకర్‌రావు వియ్యంకుడి ద్వారా ఈ తతంగమంతా నడిపారు. అసలు కథ ఏందంటే ప్రభాకర్‌ రావు వియ్యంకుడు అశోక్‌ రావు ద్వారానే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆర్థిక లావాదేవీలు నడిపిస్తున్నారు. కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి వెలిచాల రాజేందర్‌కు టికెట్‌ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్‌రావు. రాజేందర్‌కు, కాంగ్రెస్‌కు సంబంధం లేదు.. ఆయన కార్యకర్త కానేకాదు…అసెంబ్లీ ఎన్నికల నుండే రాజేందర్‌రావును ప్రభాకర్‌రావు తెర ముందుకు తీసుకొచ్చారు. కోట్ల రూపాయలు రాజేందర్‌రావు ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజ కవర్గ పరిధిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్ధులకు డబ్బులు ఇప్పించారు. రాష్ట్ర వ్యవహారాలు చూసే కాంగ్రెస్‌ నేతలకు కూడా కోట్ల రూపాయలు ముట్టజెప్పించారు. కేసీఆర్‌ ఆదేశం మేరకు ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని రాధాకిషన్‌రావు స్టేట్‌మెంట్‌ ఇచ్చిన తరువాత కూడా ఇప్పటి వరకు కేసీఆర్‌పై చర్యలెందుకు తీసుకోలేదు? అని ప్రశ్నించారు.