– ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన అంటూ ధర్నా చేయడం విడ్డూరం
– జగన్ జమానాలో విత్‌డ్రా అయిన 19 హెబియస్‌కార్పస్ కేసులపై విచారించాలి
– రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని రికార్డు చేసిన జస్టిస్ రాకేష్‌కుమార్
– దానిపై స్టే తెచ్చుకుని బయటపడ్డ జగన్ ప్రభుత్వం
– జగన్ హయాంలో మంటకలసిన మానవ హక్కులు
– లాయర్లకే గన్ పెట్టి బెదిరింపులు
– నన్ను నా భార్యనూ కిడ్నాప్ చేశారు
– కిడ్నాప్‌ను ధృవీకరించిన విశాఖ జిల్లా జడ్జి
– నాటి డీజీపీ గౌతంసవాంగ్, విశాఖ సీపీని అందుకే హైకోర్టులో నిలబెట్టారు
– ఈ ప్రభుత్వం నాకు న్యాయం చేయాలి
– ఇప్పటికీ అక్రమ కేసులతో బెదిరిస్తున్నారు
– మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతం సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగతోందని, శాంతిభద్రతలు లేవని, పోలీసులు దౌర్జన్యాలు చేస్తున్నారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా చేయటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు, వ్యాపారవేత్త రెడ్డి గౌతమ్ ఎద్దేవా చేశారు. అసలు జగన్ జమానాలో జరిగిన రాజ్యాంగవిచ్ఛిన్నంపై నాటి హైకోర్టు జస్టిస్ రాకేష్‌కుమార్ నమోదుచేసిన వ్యవహారాన్ని రీ ఓపెన్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన సామాజిక కార్యకర్త బలగం శరత్ (చక్రి)తో కలసి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా రెడ్డి గౌతమ్ ఏమన్నారంటే.. ‘‘ఏపీలో రాజ్యాంగఉల్లంఘన జరుగుతోందని మాజీ సీఎం జగన్ ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని తెలుసుకుని, మీడియా ముందుకు రావలసి వచ్చింది. అప్పట్లో సామాన్యులపై జరిగిన రాజ్యాంగ ఉల్లంఘన-రాజ్యాంగ విచ్ఛినం గురించి ప్రజలకు తెలియచేసేందుకే నేను మీడియాముందుకొచ్చా’’.
‘ జగన్ హయాంలో నన్ను, నా భార్యను అకారణంగా హింసించి, అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన ఫిర్యాదు ఆధారంగా మా ఇద్దరిపై కేసులు పెట్టారు. ఆరోగ్యం బాగోలేని నాపై దారుణంగా ప్రవర్తించారు. మా అరెస్టుతో మా చిన్నారి కొడుకు ఎక్కడున్నాడో తెలియని వేదన అనుభవించాం. నా వెనుక టీడీపీ నేతలున్నారని చెప్పాలంటూ విజయవాడ, విశాఖ పోలీలుసు హింసించారు. విశాఖలో ఒక పోలీసు ఉన్నతాధికారి అయితే.. టీడీపీ యువనేత పేరు చెప్పాలని నన్ను, నా భార్యను బెదిరించారు. అసలు ఆధారాలు లేని ఫిర్యాదుతో నన్ను వేథించిన వారిపై ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’.
‘నన్ను-నా భార్యను పోలీసులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. దానిపై లాయర్ రవితేజ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వే సిన తర్వాత గానీ విడిచిపెట్టలేదు. ఆ తర్వాతనే మా ఇద్దరిపై కేసులు
నమోదు చేశారు. మళ్లీ మరోసారి కూడా అదే పనిచేశారు. దానిపై మేం మళ్లీ హైకోర్టుకు వెళితే, హైకోర్టు న్యాయమూర్తి విశాఖ జిల్లా న్యాయమూర్తిని న్యాయవిచారణకు ఆదేశించింది. విశాఖ జడ్జిగారు కూడా మమ్మల్ని పోలీసులు అక్రమంగా కిడ్నాప్ చేశారని, ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తన నివేదికలో పేర్కొన్నారు’.
‘ ఇదే కేసులో అప్పటి డీజీపీ గౌతం సవాంగ్, విశాఖ సీపీని హైకోర్టు పలుసార్లు స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. నా కేసు వాదిస్తున్నారన్న కక్షతో లాయర్ రవితేజ, ఇస్మాయిల్‌ను పోలీసులు బెదిరించారు. చంపేస్తామని గన్ ఫోటోలు మా లాయర్ రవితేజ గారికి పంపించారు. లాయర్ ఇస్మాయిల్ ఇంటిపై దాడి చేశారు. మేం దాడిచేయలేదని బుకాయించిన పోలీసుల కట్టుకథలను లాయర్లు ఖండిస్తూ, ఇంటికి వచ్చిన పోలీసుల వివరాలను సీసీ టీవీ పుటేజ్‌లో తెలుసుకుని, దానిని హైకోర్టుకు నివేదించారు’.
‘ రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతోందని జస్టిస్ రాకేష్‌కుమార్ గారు వ్యాఖ్యానించి, దానిని రికార్డు చేసిన కేసు మాదే. దానిపై జగన్ ప్రభుత్వం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. ఇప్పటికీ ఆ కేసు పెండింగ్‌లోనే ఉంది. ఆ కేసును మళ్లీ రీ ఓపెన్ చేసి, నాడు రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నా లాంటి వారిని మరొకసారి వేధించకుండా చూడాలి. నన్ను ఇప్పటికీ అక్రమ ఫిర్యాదులతో వేధిస్తున్నారు. నాకు ప్రభుత్వం న్యాయం చేయాలి’.
‘జగన్ హయాంలో జరిగిన రాజ్యాంగ ఉల్లంఘనలు, రాజ్యాంగవిచ్ఛిన్నానికి నేను-నా భార్య తొలి బాధితులం. నాతో పాటు హెబియస్ కార్పస్ వేసిన మరో 19 మంది బాధితులు, నాడు పోలీసు బెదిరింపులతో ఫిర్యాదులను ఉపసంహరించుకున్నారంటే.. ఎవరిది రాజ్యాంగ ఉల్లంఘనో అర్ధమవుతుంది. నాకు రాజకీయాలతో సంబంధం లేదు.మా తాత రాజకీయాల్లో ఉన్నారు. 85 ఏళ్ల వృద్ధుడైన ఆయనపైనా, ఆధారాలు లేని ఫిర్యాదులతో అక్రమ కేసులు పెట్టారు. నేను సోలార్ వ్యాపారంలో ఉన్నా. అసలు ఈ రాష్ట్రంలోనే లేను. కానీ జగన్ ఈరోజు రాజ్యాంగ ఉల్లంఘనపై ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని తెలిసి, ఆయన హయాంలో నా లాంటి బాధితుడికి ఏ స్థాయిలో అన్యాయం జరిగిందో ప్రజలకు చెప్పడానికే మీడియా ముందుకొచ్చా.