వ‌ర్షాల ప‌రిస్థితుల‌పై ఆర్టీజీఎస్ లో నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌

– ప్ర‌భావిత జిల్లాల్లో 4845 స‌ర్వైలెన్స్ కెమెరాల‌తో స‌మీక్ష‌
– ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్‌

అమ‌రావ‌తి: రాష్ట్రంలో కురుస్తున్న వ‌ర్షాల ప‌రిస్థితుల‌పై ఆర్టీజీఎఎస్‌లో నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్నారు. ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్‌ ఆర్టీజీఎస్ లో చేప‌ట్టిన ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు. వ‌ర్షాలు అధికంగా కురిసే సూచ‌న‌లున్న‌ట్లు గుర్తించిన జిల్లాలో మొత్తం 4,845 స‌ర్వైలెన్సు కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అక్క‌డ ప‌రిస్థితిని ఆర్టీజీఎస్ నుంచి ప్ర‌త్య‌క్షంగా స‌మీక్షిస్తున్న తీరును ప‌రిశీలించారు.

భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని భావిస్తున్న నెల్లూరు, ప్ర‌కాశం, తిరుప‌తి, చిత్తూరు, క‌డ‌ప జిల్లాల్లో క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థ‌తిని ఆర్టీజీఎస్ సిబ్బంది తెలుసుకుంటున్న తీరును ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్ మాట్లాడుతూ వ‌ర్షాల వ‌ల్ల ఎక్క‌డ ఎలాంటి స‌మ‌స్య‌లు ఉత్పన్న‌మైనా సిబ్బంది వాటిని త‌క్ష‌ణం ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లేలా చూడాల‌ని ఆదేశించారు.

వ‌ర్ష బాధితుల‌కు ఎక్క‌డ ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్తినా వాటిని త‌క్ష‌ణం ప‌రిష్క‌రించేలా ప‌నిచేయాల‌ని సూచించారు. గంట గంట‌ల‌కు వాతావ‌ర‌ణం, వ‌ర్షాల ప‌రిస్థితుల‌పై ఆర్టీజీఎస్ నివేదిక‌లు రూపొందించాల‌న్నారు. వ‌ర్షాలు త‌గ్గిపోయి ప‌రిస్థితులు మ‌ళ్లీ మామూలు స్థితికి వ‌చ్చేంత‌వ‌ర‌కు సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

ప్ర‌ధానంగా వాయిగుండం తీరం దాటే స‌మ‌యంలో తీర ప్రాంతాల్లో వ‌ర్షాలు అధికంగా ఉంటాయ‌ని, తీర ప్రాంతాల్లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణ పెట్టాల‌న్నారు. పెన్నా న‌దుల్లో నీటి ప్ర‌వాహం వ‌ర‌ద నీరు ఎంత మేర వ‌స్తుంది త‌ద‌రి అంశాల‌న్నీ రియ‌ల్ టైమ్‌లో ప‌రిశీలిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు ఉన్న‌తాధికారుల‌కు పంపాల‌ని ఆదేశించారు.