రైల్వే సేవల విస్తరణ, ప్రాజెక్టుల అభివృద్ధి కి సహకరించండి

రైల్వే కేంద్ర సహాయ మంత్రి సోమన్నతో ఢిల్లీలో పెమ్మసాని

గుంటూరు, మహానాడు: గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన మౌలిక వసతులు, ప్రాజెక్తుల అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి. గుంటూరు, పరిసరాల్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా రైల్వే సేవల విస్తరణ జరగాలి. ట్రాఫిక్ రద్దీతో అవస్థల పాలవుతున్న ప్రజల కష్టాలను తీర్చేందుకు తోడ్పాటు అందించండని రైల్వే శాఖ కేంద్ర సహాయ మంత్రి వి. సోమన్నని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు ఆయనను ఢిల్లీలో సోమవారం కలిశారు. ఈ సందర్భంగా పెమ్మసాని పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను గురించి రైల్వే సహాయ మంత్రితో చర్చించారు. స్థానిక సమస్యలపై పెమ్మసాని తెలియజేసిన వివరాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాత వి. సోమన్న సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఫలించిన పెమ్మసాని కృషి

గుంటూరును నెంబర్ వన్ పార్లమెంట్ గా తీర్చిదిద్దుతానన్న ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా పెమసాని చంద్రశేఖర్ తన ప్రయత్నాలను వేగవంతం చేశారు. పార్లమెంటు పరిధిలోని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు, శంకర్ విలాస్ వంతెనతో పాటు పలు ఆర్ఓబి, ఆర్ యు బిల ఏర్పాటుకు ఇప్పటికే పెమ్మసాని శ్రీకారం చుట్టారు. అలాగే అమరావతికి పలు ప్రాజెక్టులను, పరిశ్రమలను తీసుకురావడంలోనూ ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే రూ. 250 కోట్ల విలువైన టెస్టింగ్ ఫెసిలిటీస్ తో కూడిన టెక్నాలజీ సెంటర్ ను అమరావతికి మంజూరు చేయించడంలో గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సఫలీకృతులయ్యారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో పెమ్మసాని ఇప్పటికే పలు ప్రాజెక్టులను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా అమరావతికి ఈ ఎమ్. ఎస్. ఎమ్. ఈ. టెక్నాలజీ సెంటర్ ను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత కార్యాలయాలకు, ఉన్నతాధికారులకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీని సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని సి ఆర్ డి ఏ కమిషనర్ కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమరావతి సి ఆర్ డి ఏ పరిధిలోని సుమారు 20 ఎకరాలలో త్వరలోనే ఈ టెక్నాలజీ సెంటర్ కు పునాది పడబోతుంది.