‘దర్శి’ ప్రగతికి సహకరించండి

– ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధి సమావేశంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

ఒంగోలు, మహానాడు: దర్శి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని, ప్రధానంగా మంచినీటి, సాగునీటి సమస్య ఉందని, దొనకొండ వంటి మండలాలు కరువు మండలాలుగా ఉన్నాయని, ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు పొట్టకూటి కోసం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వలస పోతున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధి సమావేశంలో జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జి మంత్రి, దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొని, లక్ష్మి మాట్లాడారు. దొనకొండ ప్రాంతంలోని పారిశ్రామిక అభివృద్ధి వాడ తిరిగి మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని, అదే విధంగా దర్శి పట్టణంలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ తిరిగి ప్రారంభించాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి, సాంకేతిక విద్యాలయాలు, అటకెక్కిన ఎత్తిపోతల పథకాలను మరమ్మతులు వంటి చేపట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

వెలుగొండ రిజర్వాయర్ నీటిని దొనకొండ ప్రాంతానికి రప్పించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, సాగర్ జలాలకు చివరి భూములుగా ఉండటం వల్ల సక్రమంగా సాగునీరు అందని పరిస్థితిలో ఉన్నాయని సమావేశం దృష్టికి తీసుకువెళ్ళారు. తాళ్లూరు వంటి మండలాలలో కూరగాయల సాగు, మిర్చి వంటి పంటల అధికంగా పండిస్తారని, కూరగాయలు పాడవకుండా కోల్డ్ స్టోరేజ్ నిర్మించేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరారు. దర్శి పట్టణంలో నిలిచిపోయిన కోల్డ్ స్టోరేజిని వెంటనే నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని, పట్టణంలో ప్రతి ఇంటికి కొళాయి ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మంచినీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇక, రోడ్లు, కాలువల మరమ్మతు చేయాలని ఉందన్నారు. నాలుగు నెలల కూటమి పాలనలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకోవడంతో పాటు ఒక డాక్టర్ గా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని దర్శి పట్టణంలో నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐదు వేల మందికి ఉచితంగా చికిత్సలందించి మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు. జాబ్‌మేళా వంటి కార్యక్రమాలతో ప్రజల మధ్య ఉంటున్నట్టు డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. జిల్లా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మా గుంట శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ బాలాజీకి, 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంక దినకర్ తదితరులు పాల్గొన్నారు.