ఎన్నికల్లో అక్రమాల నివారణకు సమన్వయకర్తలు

సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో నియామకం

విజయవాడ, మహానాడు : ఎన్నికలు పారదర్శకంగా జరగడానికి, అక్రమాలను నివారించడానికి సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఎన్నికల నిఘా వేదికను ఏర్పాటు చేసింది. 13 ఉమ్మడి జిల్లాలకు 13 మంది రిటైర్డ్‌ సీనియర్‌ ఐఏఎస్‌, ఉన్నత పౌర సమాజ ప్రతినిధులను ఎన్నికల నిఘా సమన్వయకర్తలుగా నియమించినట్లు సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ చైర్మన్‌ జస్టిస్‌ జి. భవానిప్రసాద్‌, ఉపాధ్యక్షుడు ఎల్‌వి.సుబ్రహ్మణ్యం, కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఎన్నికల నిఘా సమన్వయకర్తల వివరాలను మీడియాకు వెల్లడించారు.

అనంతపురం జిల్లాకు చీఫ్‌ సెక్రటరీ, కలెక్టర్‌గా పనిచేసిన ఎస్‌.పి.టక్కర్‌ను, కర్నూ లు జిల్లాకు కేరళ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెం ట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన డబ్ల్యు.ఆర్‌.రెడ్డి, కడప జిల్లాకు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, జాతీయ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన సంతోష్‌ మెహ్రా, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, చిత్తూరు జిల్లాకు రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన డాక్టర్‌ పి.రఘు, నెల్లూరు జిల్లాకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, పూర్వ కర్నూలు కలెక్టర్‌ రామశంకర్‌ నాయక్‌, ప్రకాశం జిల్లాకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, పూర్వ డైరెక్టర్‌ జనరల్‌ మానవవనరుల సంస్థ డి.చక్రపాణి, గుంటూరు జిల్లాకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, పూర్వ కాఫీ బోర్డు చైర్మన్‌, మాజీ సలహాదారులు జి.వి.కృష్ణారావు, కృష్ణా జిల్లాకు పూర్వ చీఫ్‌ సెక్రటరీ, తెలంగాణకు చెందిన డాక్టర్‌ రాజీవ్‌శర్మ, టి.సురేష్‌బాబు, పూర్వ మంగోలియా అంబాసిడర్‌, పశ్చిమగోదావరి జిల్లాకు రిటైర్డ్‌ జిల్లా జడ్జి ఎ.లక్ష్మి, తూర్పుగోదావరి జిల్లాకు తమిళనాడు కేడర్‌ కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, పూర్వ జమ్మూ కాశ్మీర్‌ గవర్నర్‌ సలహాదారులు స్కందన్‌ కుమార్‌ కృష్ణన్‌, విశాఖపట్నం జిల్లాకు హర్యానా క్యాడర్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పూర్వ భారత ఉక్కు -గనులు కార్యదర్శి, పూర్వ హర్యానా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ డాక్టర్‌ దిలీప్‌సింగ్‌, విజయనగరం జిల్లాకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, పూర్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, తెలంగాణ రెడక్రాస్‌ చైర్మన్‌ అజయ్‌ మిశ్రా, శ్రీకాకుళం జిల్లాకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, భారత ప్రభుత్వ పూర్వ స్పెషల్‌ సెక్రటరీ అటామిక్‌ ఎనర్జీకి చెందిన సి.బి.ఎస్‌.వెంకటరమణలను నియమించినట్లు తెలిపారు.