విశాఖపట్నం, మహానాడు: ఆ దారిలో ప్రయాణమంటే పరిసర ప్రాంతీయులకు నరక ప్రాయమే. నిత్యం పాదచారులు, వాహనదారులతో సందడిగా ఉండే ఆ రహదారి ప్రస్తుతం రాళ్లు పైకి తేలి, గుంతలమయం కావడంతో దైనందిన కార్యక్రమాలతో ఉరుకులు పరుగులు తీసే నివాసితులకు కంటిమీద కునుకు కరువైంది. 95వ వార్డు పరిధిలోని పురుషోత్తపురం, హెచ్ బి కాలనీ ప్రాంతవాసులు తమ దుస్థితిని వివరిస్తూ స్థానిక కార్పొరేటర్ ముమ్మన దేవుడుకు విన్నవించుకున్నారు.
ఈ మేరకు కార్పొరేటర్ ఆదివారం ఉదయం ఈ ప్రాంతాన్ని సందర్శించి, పరిస్థితిని గమనించారు. ఆయన వెంట కంఫర్ట్ హోమ్స్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వి. రామకృష్ణ, ఎం.సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి హెచ్ జోగారావు, ఇతర ప్రతినిధులు టి.మాధవ్, ఏ.కేశవరావు, గణేష్, మురళి, హెచ్ బి కాలనీ ప్రతినిధులు రమణమూర్తి, సతీష్, సత్యనారాయణ కదలి వచ్చారు. కార్పొరేటర్ దేముడు తన స్పందన వ్యక్తం చేస్తూ…. ముందుగా గోతుల్ని కప్పి సాంత్వన కలిగిస్తానని, తదుపరి అంచనా వేయించి పక్క తారు రోడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.