ఓట్ల లెక్కింపును విజయవంతంగా నిర్వహించాలి

ఎలాంటి సమస్య ఉన్నా ఆర్వో దృష్టికి తీసుకెళ్లాలి
ర్యాండమైజేషన్‌తో టేబుళ్లకు లెక్కింపు సిబ్బంది
పల్నాడు జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ బి లత్కర్‌

నరసరావుపేట: ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సంసిద్ధమవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ బి లత్కర్‌ ఎన్నికల అధికారులు, సిబ్బందికి సూచించారు. జేఎన్‌టీయూ యూనివర్సి టీలో కౌంటింగ్‌ నేపథ్యంలో సోమవారం నియోజకవర్గాల వారీగా వివిధ ప్రదేశా లలో ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ఆయ న సందర్శించి పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి సమస్య తలెత్తినా గందరగోళానికి గురికావద్దని, సమస్యను సంబంధిత నియోజక వర్గ రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించాలని, చెల్లిన, చెల్లని బ్యాలెట్‌ ఓట్లను జాగ్రత్తగా పరిశీలించి లెక్కింపు చేపట్టాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లేదా ఈవీఎం ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్‌ ఏజెంట్ల కోరిక మేరకు బ్యాలెట్లు, పోలైన ఓట్లను మరోమారు వారికి చూపించాలన్నారు.

పోలైన ఓట్లను స్పష్టంగా పేర్కొనాలి

అభ్యర్థులకు పోలైన ఓట్లను సంబంధిత పత్రాలలో నమోదు చేసే సమయంలో అంకెల సారూప్యతను దృష్టిలో పెట్టుకుని గందరగోళం లేకుండా ఉండేందుకు అంకెలను స్పష్టంగా పేర్కొనాలని, తద్వారా కంప్యూటర్లో నమోదు చేసే సిబ్బందికి అంకెల పట్ల స్పష్టత ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు మొదలవుతుందని, లెక్కింపుకు ముందు చేయాల్సిన ప్రక్రియ చాలా ఉంటుందని, ఈ నేపథ్యంలో ఎన్నికల లెక్కింపు సిబ్బంది ఉదయం 4.30 గంటలకే లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కౌంటింగ్‌ సిబ్బంది జేఎన్‌టీయూ చేరుకునేందుకు వీలుగా నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని, అవసరమైన వారు ఉప యోగించుకోవాలని కోరారు.

ర్యాండమైజేషన్‌తో సిబ్బంది కేటాయింపు

ఇప్పటికే కౌంటింగ్‌ అధికారులు, సిబ్బందికి రెండు దశల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. రెండుసార్లు ర్యాండమైజేషన్‌ ద్వారా సిబ్బందిని కేటాయిం చామన్నారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకు కౌంటింగ్‌ సిబ్బందికి ర్యాండమైజేషన్‌ ద్వారా టేబుల్స్‌ కేటాయించనున్నట్లు తెలిపారు. ఎన్నికల పరిశీ లకులు రవిశంకర్‌ శర్మ మాట్లాడుతూ కౌంటింగ్‌ ప్రక్రియ నిష్పాక్షపాతంగా, ప్రశాంతంగా చేపట్టాలన్నారు. ఈ శిక్షణ తరగతులలో జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.