ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌

మధ్యాహ్నానికి తొలి ఫలితం
తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌, తర్వాత ఈవీఎం ఓట్లు
రాష్ట్రవ్యాప్తంగా 119 మంది అబ్జర్వర్ల నియామకం
33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్‌ హాళ్ల ఏర్పాటు
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా

అమరావతి: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ మరికొద్ది గంటల్లో మొదలు కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా సోమవా రం కీలక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు మొదలవుతుందని ప్రకటించారు. ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్‌ ప్రక్రియ మొదలవుతుందని వివ రించారు. మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగిం చుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో 4.61 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియో గించుకున్నా రని చెప్పారు. 26,473 మంది ఇంటి నుంచి ఓటు వేశారని, మరో 26,721 మంది సర్వీసు ఓటర్లు ఎలక్ట్రానిక్‌ విధానంలో ఓటు వేశారని చెప్పారు.

119 మంది అబ్జర్వర్ల నియామకం

అన్ని జిల్లాల్లో కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. కొన్ని చోట్ల లోక్‌సభ కౌంటింగ్‌ హాళ్ల వద్ద పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ప్రత్యేకంగా జరుగుతుం దని, వేరే హాలులో అక్కడ 8 గంటలకు ఈవీఎంల కౌంటింగ్‌ మొదలు అవుతుం దని వివరించారు. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. కౌంటింగ్‌ ప్రక్రియ పరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం 119 మంది అబ్జర్వర్లను నియమించిందని పేర్కొన్నారు. పోస్టల్‌ బ్యాలెట్లు 102 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1 నుంచి 2 రౌండ్‌లలో లెక్కిస్తా రని, 48 నియోజకవర్గాలలో 3 రౌండ్‌లు, 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్‌లలో లెక్కిస్తారని చెప్పారు. ఇక రాష్ట్రంలో జనవరి 1 నుంచి జూన్‌ 2 వరకు మొత్తం రూ.483.15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడిరచారు. స్వాధీనం చేసుకున్న మొత్తంలో రూ.170 కోట్లు నగదు, 62 కోట్ల విలువైన లిక్కర్‌, రూ.36 కోట్ల విలువైన డ్రగ్స్‌, రూ.186 కోట్ల విలువైన వస్తువులు, రూ.29 కోట్ల విలువైన గిఫ్ట్‌లు ఉన్నాయని తెలిపారు.

అమలాపురం పార్లమెంట్‌కు 27 రౌండ్‌లు

అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ లెక్కింపునకు మొత్తం 27 రౌండ్‌లు పడుతుందని వివరించారు. ఫలితానికి దాదాపు 9 గంటల సమయం పట్టొచ్చని చెప్పారు. ఇక రాజమండ్రి, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాలలో 13 రౌండ్‌లు ఉంటాయని, ఇందుకు 5 గంటల సమయం పడుతుందని అన్నారు. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలలో 26 రౌండ్‌ల లెక్కింపు జరుగు తుం దని, కొవ్వూరు, నరసాపురంలలో 5 గంటల్లో ఫలితాలు వస్తాయని వివరించారు.