సాగు, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తా

ఆడబిడ్డగా ఆశీర్వదించండి
దర్శి మండలంలో గొట్టిపాటి లక్ష్మి ప్రచారం

ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం దర్శి మండలం బండివెలిగండ్ల పంచాయతీ పరిధిలోని గంగపాలెం, కట్ట సింగనపాలెం గ్రామాలలో ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాగునీరు లేక వ్యవసాయ పడకేసి కూలీలు, రైతులు జీవనోపాధి లేక అల్లాడిపోతున్నారని, తాము అధికారంలోకి వస్తే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. అదేవిధంగా తాగునీటి సమస్య, అంతర్గత డ్రైనేజీ సమస్యలపై దృష్టిసారిస్తానని హామీ ఇచ్చారు. ఒక ఆడబిడ్డగా, కుమార్తెగా తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.