– కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
మన కల్చరల్, స్పిరిచువల్ గైడెన్స్ ద్వారా యావత్ ప్రపంచాన్ని మనం ప్రభావితం చేస్తున్నాం. ఓ సానుకూల మార్గం వైపు ప్రపంచాన్ని తీసుకెళ్తున్నాం.
అందులో స్వామి వివేకానంద మొదలుకుని.. అనేకమంది మహానుభావులు.. మన గొప్పతనాన్ని, మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెబుతున్నాం.
అందుకే యావత్ ప్రపంచం ఇవాళ భారతదేశం వైపు గౌరవ భావంతో చూస్తోంది.
కరోనానంతర పరిస్థితుల్లో ఆధ్యాత్మిక భావన మరింత పెరిగింది.భారతదేశం హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలకు పుట్టినిల్లు. మనదేశంలో పుట్టిన అనేకమతాలు ప్రపంచమంతా విస్తరించాయి. శాంతిని బోధిస్తున్నాయి.
ఆయా మతాల ఆచార వ్యవహారాలు, ఫిలాసఫీల కారణంగా.. ‘భారతదేశం ఆధ్యాత్మిక భిన్నత్వం’ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
ఇవాళ యావత్ ప్రపంపంచ మన భారతదేశ శారీరక, మానసిక ఆరోగ్య విధానమైన ‘యోగా’ను ఉత్సాహంగా స్వీకరించింది.
మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ (ధ్యానం)ను దైనందిన జీవితంలో భాగం చేసుకుంది.
మన పురాణ, ఇతిహాసాలను, గీతాసారాన్ని, వేదాలు, ఉపనిషత్తుల్లో దాగి ఉన్న జ్ఞానాన్ని తెలుసుకునేందుకు ప్రపంచంలోని కోట్లాదిమంది ప్రజలు ప్రయత్నిస్తోంది.ఇందుకే ఇటీవలి కాలంలో భారతదేశంలో ‘స్పిరిచువల్ టూరిజం’ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది.
మన ఆధ్యాత్మిక గురువుల మార్గదర్శనం కోసం విదేశాలనుంచి ఇక్కడకు వచ్చి ఆశ్రమాల్లో ఉంటున్న భారతీయ ఆధ్యాత్మిక గొప్పదనానికి ఆకర్శితులవుతున్నారు.ఈ నేపథ్యంలో.. భారతదేశంతోపాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి స్పిరిచువల్ గురువులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి.. ‘మనశ్శాంతి నుంచి విశ్వశాంతి వైపు’ బాటలు వేయడం ద్వారా.. ప్రపంచవ్యాప్తంగా ఓ సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటుచేయాలనేది ప్రధానమంత్రి మోదీ ఆలోచన.
దీనికి అనుగుణంగానే.. ప్రపంచంలోని అన్ని మతాల సారాన్ని ఒకచోట చేర్చి విశ్వశాంతికోసం భారతదేశంలో ఒక మహత్తర కార్యక్రమం నిర్వహించాలని మోదీ గారు సూచించారు.
వచ్చే 25 ఏళ్లలో (అమృత్ కాల్) ప్రేమ, శాంతి, ఐకమత్యం భావనలను విశ్వవ్యాప్తం చేయాలనేదే వారి ఆలోచన.
దీనికి అనుగుణంగా.. వివిధ మతాల ఆధ్యాత్మిక గురువులతో ఢిల్లీలో పలుమార్లు సమావేశమయ్యాము. మార్చ్ 14 నుంచి 17వ తేదీ వరకు కేంద్ర సాంస్కృతిక శాఖ, ‘వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ హార్ట్‌ఫుల్ నెస్’ సంయుక్త ఆధ్వర్యంలో షాద్‌నగర్ సమీపంలోని కాన్హా శాంతి వనంలో ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’ నిర్వహించబోతున్నాం.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయిన దాజీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు రావడం పట్ల వారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈ మహత్కార్యంలో దాదాపు 300కు పైగా స్పిరిచువల్ లీడర్స్ తోపాటుగా.. దాదాపు లక్షమంది వరకు పాల్గొంటారని అంచనా వేస్తున్నాం.
గతేడాది భారతదేశం ఆధ్వర్యంలో జరిగిన జీ20 సమావేశాలకోసం మనం ఎంచుకున్న థీమ్ ‘వసుధైవ కుటుంబకం’ – వన్ వరల్డ్, వన్ ఫ్యామిలీ.
ఇది జీ20లో పాల్గొన్న సభ్యదేశాలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాలతోపాటు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది.
ఈ గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ లక్ష్యం కూడా ఇదే. ఐకమత్య భావన పెంపొందించడం, సకలజన సమ భావనను ప్రోత్సహించడం, ఇందుకోసం ఆధ్యాత్మిక భావనను ముందుకు తీసుకెళ్తూ.. ‘వసుధైవ కుటుంబంకం’ ఆలోచన ప్రతి వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాలనేది ఈ సందేశం ప్రపంచానికి పంపాలనే లక్ష్యంతో మన దేశంలో తొలిసారి ఇంత ఉత్సాహంగా ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక గురువులు వారి మతాల సారాన్ని, అనుభవాలను, ఆధ్యాత్మిక, తాత్వికమైన ఆలోచనలను ఈ వేదిక ద్వారా పంచుకోనున్నారు.
వీరందరి మధ్య ఆరోగ్యకరమైన చర్చ, తాత్వికమైన చర్చ జరిగి.. విశ్వశాంతికోసం మార్గదర్శనం జరుగుతుందనే సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది.
దీంతోపాటుగా.. రేపటి తరాలకోసం ఓ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు అవసరమైన పర్యావరణ పరిరక్షణ, యోగా, మెడిటేషన్ లను మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన సూచనలు కూడా ఈ వేదిక ద్వారా ప్రపంచానికి అందనున్నాయి.
గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 15వ తేదీన ఈ ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ’ను ప్రారంభించేందుకు అంగీకరించారు. మార్చి 16వ తేదీన గౌరవ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ గారు ముగింపు సమావేశంలో పాల్గొననున్నారు.
14 సాయంత్రం ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ మ్యూజిక్ కన్సర్ట్ ఉంటుంది.
17 నాడు కూడా.. స్పిరిచువల్ గురువులతో కొన్ని సెషన్స్ ఉంటాయి.
ఇటీవలే భారత ప్రధాని నరేంద్రమోదీ కాన్హా శాంతి వనాన్ని సందర్శించారు. ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం, యోగా, ధ్యానం, సంగీతం అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటుగా విశ్వశాంతికి బాటలు వేయాల్సిన అవసరాన్ని మనం అర్థం చేసుకోవాలి.
ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ అయిన.. కాన్హా శాంతి వనంలో జరుగుతున్న ఈ గొప్ప కార్యక్రమం.. సంకల్పిత లక్ష్యాలను చేరుకుంటుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇది ఒక మతానికి సంబంధించిన కార్యక్రమం కాదు. సమాజ శ్రేయస్సు, మన విశ్వశాంతి కోసం.. మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషిచేస్తున్నారు.
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను.. ఇక్కడి ఆధ్యాత్మిక భావనను పంచుకునే అన్ని దేశాలతో ఓ సుహృద్భావ పూరిత వాతావరణాన్ని నిర్మించేందుకు మోదీ గారు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు.
ఇందులో భాగంగానే.. ఈ ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’కు బాటలు పడ్డాయి. ఇలాంటి కార్యక్రమాలను సమయానుగుణంగా జరుగుతూ.. భారతదేశ కేంద్రంగా ప్రపంచానికి మార్గదర్శనం చేయాల్సిన అవసరముంది.
ఇంత గొప్ప కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తున్న ‘గ్లోబల్ గైడ్ ఆఫ్ హార్ట్-ఫుల్-నెస్’ దాజీ కి హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను.అనేకమంది ఆధ్యాత్మిక గురువులు వస్తున్నారు. ఈ కార్యక్రమ లక్ష్యాలు ప్రజలందరికీ చేరడంలో మీడియా కూడా తమవంతు సహకారాన్ని అందించాలని కోరుతున్నాను.