దళిత ద్రోహుల పార్టీ వైసీపీ

దాడుల్లో 7వ స్థానంలో రాష్ట్రం
సుధాకర్‌ నుంచి సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది బలి
12 వేల ఎకరాల భూములను కూడా లాక్కున్నారు
సంక్షేమ పథకాలు అందకుండా మోసగించారు
పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌

పల్నాడు జిల్లా, మహానాడు : దళిత ద్రోహులకు ఆశ్రయం ఇస్తున్న వ్యక్తి జగన్‌రెడ్డి అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాల పాటి శ్రీధర్‌ అన్నారు. నరసరావుపేట పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావే శంలో మాట్లాడారు. వైసీపీ దళిత ద్రోహుల పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. మండపేట నుంచి తోట త్రిమూర్తులు అనే వ్యక్తిని నిలబెట్టిందని, ఆయనకు శిరోముండనం కేసులో జైలుశిక్ష విధించిన విషయాన్ని గుర్తు చేశారు. డాక్టర్‌ సుధాకర్‌ నుంచి దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలయ్యారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల అంబేద్కర్‌ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్‌కుమార్‌ దాహం వేసి మంచినీళ్లు అడిగితే కొందరు శాడిస్టులు నిర్బంధించి నాలుగు గంటల పాటు చిత్రహింసలు పెట్టి మూత్రంపోసి అవమానించారు. ముఖ్యమంత్రి జగన్‌కు ఏ మాత్రం మనస్సాక్షి ఉన్నా ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో 6,035 మంది దళితులపై దాడులు

ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం దళితులపై దాడులు జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ 7వ స్థానంలో ఉందని, రాష్ట్రంలో 6,035 మంది దళితులపై దాడులు జరిగాయన్నారు. 2021లో మొత్తం 208 మంది ఎస్సీ మహిళలు, చిన్నారులపై దాడులు జరగ్గా 33 మంది దళితులు హత్యకు గురయ్యారని విమర్శించారు.

అస్పృశ్యత పేరుతో నంద్యాల జిల్లా మునగాల గ్రామంలోని సుంకులమ్మ ఆలయంలోకి వెళ్లకుండా అవమానించి అడ్డుకున్నారని మల్లెపోగు నరహరి అనే దళిత (మాదిగ) యువకుడు ఆత్మహత్యాయ త్నానికి పాల్పడ్డాడు. ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌ జంబులయ్య, మరికొందరు నరహరిని కాలితో తన్ని ఆలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే తీవ్రపరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

పొలంలో పనిచేస్తున్న దళిత అంగన్‌వాడీ కార్యకర్తపై కొత్తపల్లి ఎస్‌ఐ ముబీనతాజ్‌ దుర్భాషలాడి వేధించి స్టేషన్‌కు తీసుకెళ్లాడు. 2020లో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 39 మంది చిన్నారులు సహా మొత్తం 111 మంది ఎస్సీ మహిళలు వేధింపులకు గురయ్యారని వెల్లడిరచారు. మద్యం రేట్లు పెంపుపై ప్రశ్నించినందుకు చిత్తూరు జిల్లాలో దళిత యువకుడు ఓ ప్రకాశ్‌ను చంపారు. అక్రమ ఇసుక రవాణా ను ప్రశ్నించినందుకు తూర్పుగోదావరిలో వర ప్రసాద్‌ అనే యువకుడికి గుండుకొట్టించారు. మాస్క్‌ పెట్టుకోలేదని ప్రకాశం జిల్లా థామస్‌ పేటకు చెందిన కిరణ్‌ను పోలీసులు కొట్టిచంపారు. చిత్తూరు జిల్లాలో మేజిస్ట్రేట్‌ రామకృష్ణ, అతని సోదరుడు రామచంద్రపై దాడి చేశారు. దళిత మహిళా డాక్టర్‌ అనితా రాణి బాత్రూంలో ఉండగా వీడియోలు తీసి బెదిరించారు. కచ్చులూరు బోటు ప్రమాదంపై ప్రశ్నించినందుకు మాజీ ఎంపీ హర్షకుమార్‌పై అక్రమ కేసులు బనాయించారు. దళితుల అసైన్డ్‌ భూముల ఆక్రమణపై ప్రశ్నించిన మహాసేన రాజేష్‌పై అక్రమ కేసులు పెట్టారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడు సూరిబాబు అనుచరుడు దళిత యువకుడిని అర్ధనగ్నంగా చేసి చెట్టుకు కట్టేసి చెప్పుతో కొట్టాడు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం వులవపాళ్ల గ్రామంలో పెట్రోల్‌ బంక్‌ వద్ద దళిత కార్మికుడిని వైఎస్‌ఆర్సీ నేత మహేష్‌నాయుడు చెప్పుతో కొట్టి దుర్భాషలాడారని వివరించారు.

అన్ని రకాలుగా మోసం

జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 12 వేల ఎకరాల దళితుల భూములను లాక్కు న్నారు. ఇలా దళితులను ఇబ్బందులకు గురిచేస్తున్న జగన్‌ ఘనతను అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ రిలీజ్‌ చేసిన 2020 హ్యూమన్‌ రైట్స్‌ ప్రాక్టీస్‌ ఇన్‌ ఇండియా కూడా గుర్తించి తన రిపోర్టులో దళితుల పై అట్రాసిటీలని పేర్కొంది. స్టాటిస్టిక్స్‌, ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వశాఖ పేర్కొన్న దాని ప్రకా రం (ఏప్రిల్‌- జూన్‌ 2022) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దళితుల కోసం కనీసం ఒక్క ఎకరా కూడా పంపిణీ చేయలేదని వెల్లడిరచింది. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంపై వైసీపీ ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలు చేస్తోందని, దీనికి ఆరుగురు విద్యార్థులు మాత్రమే అర్హత పొందారన్నారు. టీడీపీ హయాంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 19 మందికి విదేశీ విద్యను అందించినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఎఫ్‌ఎస్‌డీసీ పథకం కింద ఉపాధి కల్పనకు ఎస్సీ లబ్ధిదారులకు సుమారు రూ.3 లక్షల వరకు ఇస్తోంది. కానీ వైసీపీ మాత్రం ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. కేజీబీవీ మోడల్‌ స్కూళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్‌ కాలేజీల్లో విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా మారిందని, నాలుగేళ్లుగా ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు సరఫరా చేయడం లేదని తెలిపారు.