ప్రమాదకర స్థాయికి చేరిన నీటి నిల్వలు
ఇప్పటికే డెడ్‌స్టోరేజ్‌కు చేరువలో ప్రాజెక్టులు
తెలుగు రాష్ట్రాలకు తాగునీటి గండం
రానున్న మూడునెలలు కష్టమే అంటున్న అధికారులు
పల్నాడు జిల్లా సాగర్ ప్రాజెక్ట్, మహానాడు న్యూస్: తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించే నాగార్జున సాగర్ అడు గంటుతోంది. ప్రమాదకర స్థాయి డెడ్ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్ బెల్స్‌ను మోగిస్తోంది. దీంతో సాగర్, కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్ జంట నగరాలు, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి గండం పొంచి ఉంది. తెలుగు రాష్ట్రాల వరప్రదాయినిగా ఉన్న నాగార్జునసాగర్ తీవ్ర వర్షాభావంతో వట్టి పోయింది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక నిండుకుంటోంది. దీంతో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఖరీఫ్, రబీ సీజన్‌లో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది. మరోవైపు వేసవి కాలం ప్రారంభం కావడంతో సాగర్ కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్ జంట నగరాలు, ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమవుతోంది.
డెడ్ స్టోరేజ్‌కి చేరుకున్న నీటి మట్టం..
590 అడుగుల గరిష్ఠ స్థాయి నీటిమట్టం కలిగిన నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 511 అడుగుల నీటిమట్టంతో 133.7 టీఎంసీల నీరు ఉంది. సాగర్ డెడ్ స్టోరేజ్ 510 అడుగులు, 131 టీఎంసీలుగా నిర్ణయించడం జరిగింది. అయితే డెడ్ స్టోరేజ్‌కు కేవలం మూడు అడుగుల దూరంలోనే ఉంది సాగర్ డ్యామ్. దీంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 528.30 అడుగులతో 164 టీఎంసీల నీరు ఉంది. గత ఏడాదితో పోల్చితే నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో 31 టీఎంసీల నీటి లభ్యత తక్కువగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నీటిమట్టం డెడ్ స్టోరేజ్‌కు చేరుకుంటోంది.
తాగునీటికి కటకట
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి హైదరాబాద్ జంట నగరాలు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. సాగర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి పుట్టంగండి వద్ద ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా రెండు మోటార్లతో 900 క్యూసెక్కుల నీటిని అక్కంపల్లి రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి జంట నగరాలకు 550 క్యూసెక్కులు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 597 గ్రామాలకు రోజుకు 25 క్యూసెక్కుల తాగునీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో తాగునీటికి ప్రమాదం పొంచి ఉంది. సాగర్ నీటిమట్టం డెడ్ స్టోరేజ్‌కు చేరువలో ఉంది. కేవలం రెండు టీఎంసీల నీరే డెడ్ స్టోరేజ్ కన్నా ఎక్కువ ఉంది. ప్రస్తుతం అయితే ఏప్రిల్ నెల వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రిజర్వాయర్లలో తాగునీటికి సరిపడా నీరు ఉంది. మే, జూన్, జూలై మూడు నెలలకు తాగునీటికి కటకట లాడే పరిస్థితి ఉంది.
జీరో లెవల్ నుంచి పుట్టంగండి వద్ద పంపింగ్
హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి సరఫరాను ప్రస్తుతం పుట్టంగండి ఎత్తిపోతల పథకం ద్వారా జరుగుతోంది. 510 అడుగుల డెడ్ స్టోరీకి దిగవకు నీటిమట్టం పడిపోతే పంపింగ్ కష్టమే అవుతుంది. నీటి మట్టాలు 510 అడుగుల దిగువనకు చేరినప్పుడు బ్యాక్ వాటర్ వద్ద జీరో పాయింట్ నుంచి డ్రెడ్జింగ్ ప్రక్రియతో భారీ మోటార్లతో పంపిం గ్ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు 1450 కోట్ల రూపాయల తో సుంకిశాల వద్ద మూడోదశ పైపు పనులు కూడా కొనసాగుతున్నాయి. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అత్యవసర పనులను చేపడుతున్నారు. మరోవైపు ఏపీ తాగునీటి అవసరాలకు ఐదు టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేస్తున్నారు. దీంతో రెండు రోజుల్లో డెడ్ స్టోరేజ్‌కు చేరుకునే ప్రమాదం ఉంది. భవిష్యత్ అవసరాలకు శ్రీశైలం, జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకునే అవకాశం కూడా లేదు. ఇప్పటికే ఆ రెండు ప్రాజెక్టులు వట్టిపోయి ఉన్నాయి. మరో మూడు నెలల పాటు తాగునీటి అవసరా లు ఎలా తీర్చుకోవాలని దానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
డెడ్ లెవెల్‌కు చేరువలో శ్రీశైలం జలాశయం
అటు నంద్యాల జిల్లా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాగు, తాగునీరందించే శ్రీశైలం జలాశయం ఇప్పుడు నీటి నిల్వలు తగ్గిపోయి వెలవెలబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అవసరమైన 215 టీఎంసీలకు గాను.. ఇప్పుడు 34 టీఎంసీల నీరు మాత్ర మే నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ ఎండాకాల సీజన్‌లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
శ్రీశైలం పూర్తి స్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు
శ్రీశైలం జలాశయంలో గత ఏడాది ఏప్రిల్ 8 నాటికి 805.80 అడుగులు, 31.9380 టీఎంసీ నీరు ఉంది. అయితే ప్రస్తుతం నీటిమట్టం 810.70 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయిు నీటిమట్టం 885 అడుగులు. కాగా ప్రస్తుతం 809.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 34.2438 టీఎంసీలుగా నమోదైంది. అయితే శ్రీశైలం జలాశయం ప్రస్తుతం నీరులేక అడుగంటిపోయింది.