దర్శి పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతా

అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా
మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి

ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : దర్శి పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతామని దర్శి టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఆమె వాకర్స్‌తో పాటు వాకింగ్‌ చేశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. దర్శి చుట్టూ ఉన్న గ్రామాలకు నియోజక వర్గ కేంద్రమైన దర్శి పట్టణానికి సరిపడా అన్ని వసతులు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తా మని, 30 రోజుల తర్వాత ఏర్పడే మన ప్రభుత్వంలో మన దర్శి పట్టణాన్ని అభివృద్ధిలో పరుగు లు పెట్టిస్తామని చెప్పారు. ముఖ్యంగా తాగునీటికి శాశ్వత పరిష్కారం చేసి సాగర్‌ జలాలతో ఉన్న సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును విస్తరించి నెదర్లాండ్‌ స్కీమును అభివృద్ధి చేసి ప్రతి ఇంటికి కొళాయి ఏర్పాటు చేయించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

దర్శి ఓటర్లు చైతన్య వంతమైన ఓటర్లు అని, రాష్ట్రమంతా ఏకపక్షంగా వైసీపీ స్థానిక సంస్థల్లో పోటీ లేకుండా గెలిస్తే దర్శిలో మాత్రం వైసీపీ దాడులకు ఎదురొడ్డి నిలబడ్డారంటే ఎంత చైతన్యవంతులో అర్థమవు తుందన్నారు. నగర పాలక సంస్థ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, సీనియర్‌ నాయకులు నారపు శెట్టి పాపారావు సహకారంతో దర్శిలో మన ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరించు కుందామని భరోసా ఇచ్చారు. మీ ఆడబిడ్డగా గొట్టిపాటి వారి బిడ్డగా దర్శికి వచ్చాను… మహిళలు, ఉద్యోగస్తులు, వ్యాపార వర్గాలు, చిరు వ్యాపారులు, మేధావులు అందరూ ఆదరించి మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి దర్శి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకునేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఆమె వెంట టీడీపీ నాయకులు ఉన్నారు.