మంత్రుల సహకారం కోరిన గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు : అభివృద్ధి పథంలో దర్శిని నడిపేందుకు జనసేన బీజేపీ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివిధ శాఖల కీలక మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ఇందులో భాగంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణని మర్యాదపూర్వకంగా కలుసుకొని దర్శి నగరపాలక అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. మౌలిక సదుపాయాల కల్పన, ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దర్శి ప్రజలకు ఇచ్చిన హామీలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రతి ఇంటికి కుళాయి లక్ష్యంగా శాశ్వత తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని మంత్రిని కోరారు. అదేవిధంగా దర్శి నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు పార్కులు, మున్సిపల్ స్కూల్, డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం ..తదితర అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిచేయాలని మంత్రి నారాయణని కోరారు. దీనిపై మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
దర్శి అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారని డాక్టర్ లక్ష్మి వివరించారు. అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కూడా మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. వెనుకబడిన దర్శి ప్రాంతంలో సాగునీటి కష్టాలను తీర్చేందుకు మంత్రివర్యులు సహకరించాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయడం, వెలుగొండ, తాళ్లూరు ప్రాజెక్టులను పూర్తి చేయడం కరువు ప్రాంతంలో సస్యశ్యామలంగా సాగునీరు అందించి చివరి భూముల వరకు నీరందే విధంగా సంబంధిత అధికారుల సహకారంతో మంత్రివర్యులు సహకరించాలని లక్ష్మీ కోరారు. దీనిపై మంత్రి రామానాయుడు దర్శి ప్రాంతంలో సాగునీటి కష్టాలు తీర్చేందుకు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు రైతాంగానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారని లక్ష్మి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె వెంట డాక్టర్ కడియాల లలిత్ సాగర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.