-ఇంట్లోనే చెల్లని ‘ముద్ర’గడ
-ముద్రగడ ఫ్యామిలీలోనే తిరగని ‘ఫ్యాను’
-తండ్రిని నమ్మవద్దన్న కూతురు క్రాంతిభారతి
-ఎన్నికల తర్వాత తండ్రిని జగన్ వదిలేస్తారని జోస్యం
-కూతురు తన ప్రాపర్టీ కాదన్న ముద్రగడ
-పిఠాపురంలో పవన్‌కే మద్దతు ప్రకటించిన ముద్రగడ కూతురు
-పిఠాపురంలో తండ్రీకూతుళ్ల యుద్ధం
-తల పట్టుకున్న వైసీపీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఒకప్పుడు కాపులకు ఆయన పిలుపే ప్రభంజనం. ఆయన పిలిస్తే తునిలో రైలుపట్టాలకెక్కారు. బోగీలు తగులబెట్టారు. పోలీసుస్టేషన్‌ను తగులబెట్టారు. ఆయన కొట్టమంటే చెంచాలతో కంచాలపై చప్పుళ్లు చేశారు. సొంతకులంపై అంత బలమైన ‘ముద్ర’ ఆయనది. కానీ అది సొంతింట్లో మాత్రం చెల్లడంలేదు. రాష్ట్రంలోని కాపులందరికీ పెద్దదిక్కుగా ఉన్న ఆయన మాట, సొంత కూతురే వినే దిక్కులేదు. పైగా ‘‘మా నాన్న వెళుతున్న దారి తప్పు. మా నాన్నను జగన్ వాడుకుని వదిలేస్తారు. మా నాన్న పవన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా.. నా మద్దతు మాత్రం పవన్‌కల్యాణ్‌కే’’నని ముద్దుల బిడ్డ కుండబద్దలు కొట్టిన అవమానకర పరిస్థితి. ఇదీ స్వయంప్రకటిత కాపుజాతిపిత ముద్రగడ పద్మనాభానికి పిఠాపురంలో ఉన్న పలుకుబడి.
‘‘చెరపకురా చెడేవు’’ అన్నది పాత సామెత. అది ఇప్పుడు పిఠాపురం ముద్రగడ విషయంలో నిజమయింది. కాపుజాతి పితగా తనకు తాను భావించుకునే మాజీమంత్రి, కొద్దికాలం క్రితమే వైసీపీ తీర్దం పుచ్చుకున్న ముద్రగడ పద్మనాభం సొంతింట్లోనే, ‘ఫ్యాను’ తిరగని వైనం ఆయన గాలి తీసింది. కాపుల్లో బోలెడు ఇమేజ్ ఉన్న ముద్రగడను రంగంలో దింపితే, కాపుల ఓట్లు చీల్చవచ్చన్న వైసీపీ వ్యూహం ఎదురు తిరిగింది. ముద్రగడను ముందుపెట్టి జనసేన చీఫ్ పవన్‌ను, పిఠాపురంలో ఓడిద్దామన్న జగన్ కల బోల్తాపడింది.
ముద్రగడ సొంత కుమార్తెనే.. నా తండ్రి మాటలు నమ్మవద్దని వీడియో రిలీజు చేసి, స్వయంప్రకటిత కాపుజాతిపిత పరువు పిఠాపురానికెక్కించారు. దీనితో ‘సొంత ఇంట్లోనే చెల్లని ముద్రగడ బయట కాపుల ఓట్లు ఏం సాధిస్తారు? అసలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? సొంత బిడ్డనే ఒప్పించలేని ఆయన కాపులందరిని ఎలా ఒప్పిస్తారు? ఆయన అడిగితే మాత్రం ఎవరు ఓట్లేస్తారు’అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
తన తండ్రి ముద్రగడ పద్మనాభం మాటలు నమ్మవద్దని ఆయన కూతురు క్రాంతి వీడియో ద్వారా ఇచ్చిన పిలుపు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. తండ్రిపై కూతురు తిరుగుబాటుతో, కాపుల్లో ముద్రగడ ఇమేజీని భారీగా డామేజీ చేసింది. ఇంతకూ ముద్రగడ బిడ్డ క్రాంతి ఏమన్నారంటే…
‘‘పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత విజయం కోసం తన తండ్రి పనిచేయొచ్చు, కష్ట పడొచ్చు తప్పు లేదు. జగన్ మెప్పు కోసం పవన్ కల్యాణ్ మీద మాట్లాడుతున్న భాష మాత్రం సరికాదు.
పవన్ కల్యాణ్, ఆయన అభిమానులను కించపరిచేలా మాట్లాడటం తగదు. ముద్రగడ తీరు మార్చుకోవాలి. పవన్ కల్యాణ్‌ను తిట్టడం వల్ల ఒరిగేదేమి లేదు. ఎన్నికల సమయంలో ముద్రగడను సీఎం జగన్ వాడుతున్నారు. ఆ తర్వాత ముద్రగడ ఎటు కాకుండా పోవడం ఖాయం. ఈ విషయం ముద్రగడ తెలుసుకుంటే మంచిది. పవన్ కల్యాణ్ గెలుపు కోసం నా వంతుగా కృషి చేస్తా’’ అని క్రాంతి భారతి అన్నారు.
పాలకులపై తిరుగుబాటు చేసే తనపైనే.. తన సొంతిట్లోనే.. అదీ సొంత కూతురే తిరుగుబాటు చేయడంతో, ముద్రగడ ఖంగుతినాల్సి వచ్చింది. తర్వాత తే రుకుని నా కూతురు నా ప్రాపర్టీ కాదు అని వివరణ ఇచ్చుకోవలసిన దుస్థితి. కూతురు వ్యాఖ్యలపై ముద్రగడ ఏమన్నారంటే..
‘‘నా కూతురి వ్యాఖ్యలకు భయపడను. నా కూతురు నా ప్రాపర్టీ కాదు’’ అని ముద్రగడ పద్మనాభం అన్నారు. తన కూతురికి పెళ్లి అవ్వకముందు నా ప్రాపర్టీ.. పెళ్లి అయ్యాక అత్తగారి ప్రాపర్టీ అని వ్యాఖ్యానించారు. ‘‘ నా కూతురు చేత వీడియో రిలీజ్ చేయించారు. ఎవరు బెదిరించినా బెదిరిపోను జగన్‌కి సేవకుడిగా ఉంటాను. నా కూతురికి నాకు మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. బెదిరిపోను. ఇదే పరిస్థితి రేపు పెండెం దొరబాబుకి రావచ్చు’’ అని ముద్రగడ పద్మనాభం అన్నారు.
తాజా పరిణామాలు ముద్రగడకు, సొంతింట్లోనే పలుకుబడి లేదని.. సొంత కూతురితోనే వైసీపీకి ఓటు వేయించలేని ఆయన, ఇక కాపులతో ఎలా ఓట్లు వేయించగలరన్న ప్రశ్నలను తెరపైకి తెచ్చాయి. అటు వైసీపీ కూడా తాజా పరిణామాలతో తలపట్టుకోవలసివచ్చింది. ముద్రగడను ముందుపెట్టి.. పవన్ కాపుల ఓట్లకు గండికొట్టించాలన్న వ్యూహం తిరగబడటంతో, ఇక ఆయనను పక్కనపెట్టడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.