– బడ్జెట్లో జిల్లాకు నిధులు తీసుకురండి
– పెండింగ్-కొత్త ప్రాజెక్టులకు మోక్షం కలిగించండి
– కేంద్రమంత్రి బండి సంజయ్‌కు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగలేఖ
కరీంనగర్: జిల్లాకు చెందిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కేంద్రమంత్రిగా మీ పలుకుబడి ఉపయోగించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తన జిల్లాకే చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్‌కు రాసిన బహిరంగలేఖలో కోరారు. ఆమేరకు ఆయా ప్రాజెక్టుల వివరాలు తన లేఖలో పేర్కొన్నారు.
మంత్రి పొన్నం బహిరంగలేఖ పూర్తి పాఠం ఇదీ..
కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం మరియు ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కోసం 2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చే బడ్జెట్ సెషన్లో తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడాలని కోరుతున్న.
తెలంగాణ రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర సంబంధాలను మెరుగుపరచడంలో కేంద్ర ప్రభుత్వానికి తన మద్దతును అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఈ విషయంలో రాష్ట్ర విభజన సమయంలో మన రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతగా వ్యవహరించాలి.రాష్ట్రానికి కేంద్రం నిధులు తీసుకురావడంలో కేంద్ర మంత్రిగా మీ పాత్ర చాలా కీలకమైంది.
నేను రాష్ట్ర మంత్రిగా మరియు కరీంనగర్ బిడ్డ గా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైన బడ్జెట్ కోసం చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అభివృద్ధి పనుల గురించి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను.
1.స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం.
2.మిడ్ మానేరు , గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసిత భాదిత కుటుంబాలకు సూక్ష్మ ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపన.
3. శాతవాహన విశ్వవిద్యాలయానికి 200 కోట్ల ఆర్థిక సహాయం అందించడం
4. కరీంనగర్ తిరుపతి మధ్య నడిచే బై వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు ప్రతి రోజు నడిచేలా చేయాలి.
5. కరీంనగర్ మరియు షిర్డీ మధ్య రైల్వే మార్గం డబ్లింగ్‌ను వేగవంతం చేయడం
6.హుస్నాబాద్‌లో మెడికల్ కాలేజీ మంజూరు.
7 కొత్తపల్లి నుండి జనగాం జాతీయ రహదారి మంజూరు.
8. సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధికి నిధులు.
9 వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి నిధులు.
10. NLM, PMEG మరియు NHM పథకాల కింద తగినంత బడ్జెట్ కేటాయింపు.
రాబోయే బడ్జెట్ సమావేశాలలో పైన పేర్కొన్న అభివృద్ధి పనులను కార్యరూపం దాల్చేందుకు కరీంనగర్ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించాలని కోరుతున్న.