Mahanaadu-Logo-PNG-Large

పరిపూర్ణానందకు పరాభవం

– స్వామీ.. నదికి పోలేదా?
– అడ్డం తిరిగిన సాములోరి జోస్యం
– వైసీపీకి 123 సీట్లు వస్తాయన్న పరిపూర్ణ
-23 కూడా దక్కని విషాద ఫలితం
– సోషల్‌మీడియాలో స్వామికి వెక్కిరింపుల పర్వం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్నికల ఫలితాల రోజున కాకినాడ శ్రీపీఠాథిపతి పరిపూర్ణానందస్వామి ముఖం ఎక్కడా కనిపించడం లేదు. మాట ఎక్కడా వినిపించడం లేదు. పాపం ఆయన ముఖం చెల్లక, ముఖం చాటేసినట్లున్నారని నెటిజన్లు తెగ వెక్కిరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 123 స్థానాలతో.. జగన్ మళ్లీ సీఎం అవుతారని సెలవిచ్చిన స్వామి వారి భవిష్యవాణి అడ్డం తిరిగింది. స్వామి వారు చెప్పినట్లు 123 కాదు కదా? కనీసం 23 సీట్లు కూడా వచ్చే అవకాశాలు కనిపించలేదు. పోనీ ఇంతమంది జాతకం చెప్పి, ఫలానా వాళ్లు గెలుస్తారని సెలవిచ్చిన స్వామి వారేమైనా ఈ ఎన్నికల్లో గెలిచారా అంటే, పాపం ధరావతు కూడా దక్కిన దాఖలాలు కనిపించడం లేదు. శకునాలు చెప్పే బల్లి కుడితలు పడిందంటే ఇదే కామోసు?!

తానొక యోగి ఆదిత్యనాధ్ మాదిరిగా భ్రమించి.. తాను చెబితే హిందువులంతా పాటిస్తారన్న వెర్రి భ్రమలు, పిచ్చి బిల్డప్పులతో స్వామి, హిందూ సమాజంలో తనకున్న కొద్దిపాటి గౌరవాన్ని కూడా గోదావరి-పెన్నా-తుంగభద్ర-చిత్రావతినదిలో కలుపేసుకున్నారు. ఇప్పుడు ఆయన వాచాలత్వం వల్ల, ఏ భక్తుడూ స్వామని గౌరవించరు. క్రైస్తవుడైన జగన్‌కు కీర్తించినందుకు ఏ హిందువూ ఆయనకు మొక్కరు. పోనీ తమ దేవుడిబిడ్డ జగన్‌ను స్వామి ఆశీర్వదించారు కాబట్టి, క్రైస్తవులేమైనా ఆయనకు పట్టాభిషేకం చేస్తారా? అంటే లేదు. అంటే సాములోరు ఉభయభ్రష్టత్వం చెందారన్నమాట. స్థాయికి మించిన ఆలోచనలు, శక్తికి మించిన ప్రయత్నాలు చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి.

స్వామి వారి ఉపదేశాలు వినేందుకు లక్షల్లో జనం వచ్చినంత మాత్రాన.. వారంతా ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటేస్తారనుకోవడం వెర్రితనం. సిల్కు స్మిత, జయమాలిని, డిస్కోశాంతి వచ్చినా వాళ్లను చూడ్డానికి జనం ఎగబడతారు. కానీ వాళ్లు ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లేస్తారా? ఆ మాటకొస్తే ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి, పవన్ వంటి సూపర్‌స్టార్లు కూడా ఎన్నికల్లో ఓడిపోయిన వారే. వారందరికంటే పరిపూర్ణానంద స్వామి ఎక్కువా? అన్నది మేధావుల ప్రశ్న.

మొత్తానికి ఈ ఎన్నికల్లో విశాఖ స్వరూపుడు ధన్యజీవి. జగనన్న కోసం పాపం ఈసారి ఆయన తపశ్శక్తులు ధారపోసినట్లు లేరు. నువ్వు గెలుస్తున్నావు బిడ్డా అని.. ముద్దులు పెట్టి మరీ ఆశీర్వదించినట్లు కూడా లేరు. బిడ్డను రిషికేష్ తీసుకువెళ్లి, నదిలో మూడు మునకలు వేయించినట్లు లేదు. ఆ బిడ్డ చెవిలో విజయమంత్రం కూడా ఉపదేశించినట్లు లేరు.

చిన్నప్పుడు పెద్దలు ఒకమాట చెబుతుంటారు. కథల్లో కూడా.. ఎవరి పని వారు చేయాలి. కుక్కపని కుక్క .. గాడిద పని గాడిద చేయాలని చెబుతుంటారు. కుక్క పని గాడిద.. గాడిద పని కుక్క చేస్తే ఫలితం ఎలా ఉంటుందో కూడా, ఆ కథలో విడమరిచి మరీ చెప్పారు. బహుశా సాములోరు ఆ కథ చదివి ఉండకపోవచ్చన్నది బుద్ధిజీవుల ఉవాచ. ఇప్పుడు సోషల్‌మీడియాలో వినిపిస్తున్నమాట ఒకటే.. స్వామీ.. నదికిపోలేదా?!