మూడునెలల పాలనపై చర్చకు సిద్ధమా?
బీఆర్ఎస్ అక్రమాలను బయటకు తీస్తాం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం, మహానాడు: ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం అంబేద్కర్ జయంతి నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం లో ప్రజాస్వామ్య పాలన అందిస్తుందన్నారు. అప్పులతో కూడిన రాష్ట్రాన్ని చిందర వందర చేసి చేతికిచ్చినప్పటికీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టామన్నారు.
ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
బిఆర్ఎస్పై భట్టి ఫైర్
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం భావ స్వేచ్ఛ లేకుండా పదేళ్లు పాలన చేసిన బిఆర్ఎస్ విద్యుత్తు రంగాన్ని గందర గోళంలోకి నెట్టేసి 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు. కాంగ్రెస్ మూడు నెలల ప్రజాపాలనపై, గత బీఆర్ఎస్ పరిపాలన చేసిన పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరా రు. కాళేశ్వరం, సాగునీటి ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల రుణాలు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలపై భారం వేశారన్నారు. ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వని కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బిల్లు పదివేల కోట్లు చెల్లించే దుస్థితి తెచ్చారని విమర్శించారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టు పనులను టెండర్లు లేకుండా ఇష్టారాజ్యంగా నామినేషన్ పద్ధతిపై ఇచ్చిందన్నారు.
ఇంపోర్టె డ్ బొగ్గు తీసుకు వచ్చి కాలుష్యం లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తామని తప్పుడు సమాచారం ఇచ్చి భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను బిఆర్ఎస్ పాలకులు మోసం చేశారని దుయ్యబట్టారు. కమీషన్ల కక్కుర్తి కోసం యాదాద్రి, భద్రాది పవర్ ప్రాజెక్టు పనులను మొదలుపెట్టారని ఆరోపించారు. సోలార్ విద్యుత్తు యూనిట్‌కు రూ.5.59 పైసలకే అందే పరిస్థితిలో యూనిట్‌కు 9 వ్యయంతో తయారయ్యే ఎన్టీపీసీ విద్యుత్తు అవసరమా ప్రజలు ఆలోచించాలన్నారు. బిఆర్ ఎస్ పాలకు లు చేసిన తప్పిదాలను అవినీతి అక్రమాలను తప్పకుండా బయటకు తీస్తామని తెలిపారు.