హైడ్రాతో కాంగ్రెస్‌ విధ్వంసం!

– మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

హైదరాబాద్‌, మహానాడు: కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పాములా బుసలు కొట్టి విధ్వంసం సృష్టిస్తోందని, సూర్యాపేట సహా రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న సర్వేలు , కూల్చివేతలకు పాల్పడుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే.. బాధ్యత లేకుండా అర్థంలేని పనులతో ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నారు. నెరవేర్చని హామీలపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని అణచివేసే కుట్ర చేస్తున్నారు. నీటి వనరుల సంరక్షణ తోపాటు ప్రభుత్వం అక్కడి ప్రజల బాధ్యత కూడా తీసుకోవాలి. ప్రభుత్వ శాఖలు అనుమతులిచ్చాకే ప్రజలు అక్కడ నివసిస్తున్నారు.

ఇప్పుడు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ల సర్వే , కూల్చివేతలు అంటూ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. ట్యాంక్ బండ్ ఉన్న ప్రాంతాల్లో కూడా అనవసర భయాలు సృష్టిస్తున్నారు. కేవలం సూర్యాపేటలో 1000 కోట్ల నష్టం జరిగేలా ఉంది. పేద ప్రజల పై ప్రభుత్వ దమనకాండ సాగనివ్వం. ప్రాణం పోయినా ప్రభుత్వ దుర్మార్గాన్ని అడ్డుకుంటాం ప్రజల పక్షాన నిలబడతాం. తప్పు ప్రభుత్వం చేస్తే శిక్షలు ప్రజలకా…? ప్రభుత్వ పనికిమాలిన పనుల పై న్యాయ పోరాటం చేస్తాం. తక్షణమే చెరువుల ఎఫ్ టీ ఎల్ , బఫర్ జోన్ల పై శాస్త్రీయ నిర్ణయం చేయాలి.