దిగజారిన శాంతి భద్రతలు

*చెంచు మహిళ పై అత్యాచారం జరిగినా సీఎం స్పందించక పోవడం దురదృష్టకరం.

* పాలమూరు బిడ్డనని మాయ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి .
* స్వంత జిల్లాలోనే ఆవాంఛనీయ ఘటనలు జరుగుతున్నా చోద్యం చూస్తున్నారు .
*రాష్ట్రాన్ని గూండాలు, రౌడీల రాజ్యం గా మార్చాలని చూస్తున్నారు.
* ప్రశ్నిస్తే కేసులు పెట్టాలని చూస్తున్నారు.

హైదారాబాద్,జూన్ 21 మహానాడు: కొల్లాపూర్ నియోజకవర్గం లో శాంతి భద్రతలు దిగజారిపోయాయనీ వరసగా జరుగుతున్న సంఘటనలు పోలీసుల పై విశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నాయనీ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.

తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో బీరం హర్ష వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చెంచు మహిళ పై అత్యాచారం ఘటన లో బండి శివ అనే వ్యక్తి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకోవడం లేదనీ,తక్షణమే బాధిత మహిళకు 50 లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలనీ అన్నారు.

మరో ఘటనలో కొల్లాపూర్ పోలీసు స్టేషన్ లోనే మహిళ విషం తీసుకుని చనిపోయింది.పోలీసు స్టేషన్ లో సీసీ కెమెరా లు పని చేయడం లేదంటున్నారనీ  పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధ్యులైన స్థానిక పోలీసుల పై చర్యలు తీసుకోవాలనీ బీ ఆర్ ఎస్ నేత డాక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

రాష్ట్రం లో హోం ,విద్య శాఖలకు ప్రత్యేక మంత్రులు లేకపోవడం దురదృష్టకరమనీ, సీఎం దగ్గరే ఈ శాఖలు ఉన్నా ఆ రెండు శాఖల్లో జరుగకూడని ఘటనలు జరుగుతున్నాయనీ, రాష్ట్రాన్ని వల్లకాడు చేయాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

చెంచు మహిళ పై వారం రోజుల పాటు అత్యాచారం జరుగుతున్నా పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్లు, పోలీసు స్టేషన్ లో మహిళ కు రక్షణ లేక పోతే ఎలా, శ్రీదర్ రెడ్డి హత్య జరిగి నలభై రోజులు అవుతున్నా, దోషులను ఎందుకు పట్టుకోలేదు,ఇంత మంది పోలీసులు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు.

హైదరాబాద్ లో 24 గంటల్లో ఐదు హత్యలు జరిగాయనీ,మెదక్ లో మత కల్లోలాలు జరిగినా పోలీసులు చోద్యం చూశారన్నారు. రాష్ట్రం లో శాంతి భద్రతల వైఫల్యం కొటొచ్చినట్టు కనిపిస్తోందనీ, పోలీసులు సోషల్ మీడియా లో పోస్టులు పెట్టిన వారి పై కేసులు పెట్టడం లో బిజీ గా ఉన్నారా అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి హోం శాఖను తన దగ్గర పెట్టుకుని ఏం లాభం అంటూ, సీఎం అసలు శాంతి భద్రతలపై రివ్యూ చేస్తున్నారా లేదా ,సీసీఎస్ లో పోలీసులు ఏసీబి కి పట్టుబడుతున్న దౌర్భాగ్య పరిస్థితి ఉంది. కేసీఆర్ హయం లో పొలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందనీ,16 లక్షలు సీసీ కెమెరాలను, ఆధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కేసీఆర్ ఎర్పాటు చేశారన్నారు.

శాంతి భద్రతల్లో వైఫల్యం చెందిన రేవంత్ రెడ్డి ని సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలనీ కాంగ్రెస్ హై కమాండ్ ను డిమాండ్ చేస్తున్నామన్నారు. నయీమ్ ముఠా ఆనవాళ్లు మళ్లీ కనిపిస్తున్నాయనీ,నాగర్ కర్నూల్ డి ఎస్ పి ని తక్షణమే విధుల నుంచి తప్పించాలనీ, రాష్ట్రంలో హోం మంత్రి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

అడుగంటి పోతున్న శాంతి భద్రతల పై బీ ఆర్ ఎస్ పక్షాన పోరాడతామన్నారు. భూపాల పల్లిలో ఎస్ ఐ దాష్టీకం ,సుల్తానా బాద్ లో మైనర్ బాలిక పై అత్యాచారం ప్రభుత్వ వైఫల్యాలే అని అన్నారు. ఇప్పటికైనా శాంతి భద్రతలను పరిరక్షించాలన్నారు. సీఎం రేవంత్ పేగులు మెడలో వేసుకుంటాం అనే డైలాగులు తప్ప శాంతి భద్రతల మీద ధ్యాస పెట్టడం లేదన్నారు. సమస్య అంతా సీఎం నిర్లక్ష ధోరణి తోనే ఉందన్నారు. సంచలన ఘటనలు జరిగినా రేవంత్ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారనీ, ఏ సీఎం గతం లో ఇలా వ్యవహరించలేదనీ,రాష్ట్రం శాంతియుతంగా ఉండటం సీఎం కు ఇష్టం లేదా అని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రం లో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా సీఎం దృష్టి రాజకీయాలపైనే ఉంది  వేరే పార్టి నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం పైనే రేవంత్ కు శ్రద్ధ ఉంది అన్నారు. మూడు చింతల పల్లి లో చెంచు మహిళ పై జరిగిన అత్యాచార ఘటనను సీఎం సీరియస్ గా స్పందించాలనీ,బాధిత మహిళా కుటుంబానికి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలన్నారు. శాంతి భద్రతలపై సీఎం రాజీపడితే మేము చూస్తూ ఊరుకోము అని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు ,బీరం హర్షవర్షన్ రెడ్డి ,బీ ఆర్ ఎస్ నేత డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.