అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయం

– శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడిన దుర్మార్గులు వైసీపీ నేతలు
– శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి

వెలుగోడు, మహానాడు: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీశైలం ఎమ్మెల్యే బి.రాజశేఖర రెడ్డి అన్నారు. బోయరేవుల గ్రామంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సర్పంచ్‌ పెద్ద స్వామన్న అధ్యక్షతన నిర్వహించారు. 100 రోజుల్లో ప్రభుత్వం ఉమ్మడి మ్యానిఫెస్టోలు తెలిపిన విధంగా పెన్షన్లు రూ.4వేలకు పెంపు, మెగా డీఎస్సీ, గ్రామీణ అభివృద్ధికి పంచాయతీకి నిధులు, అన్నక్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.5లకే భోజనం, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు చేసినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని ఏ శాఖలోనూ ఒక్క రూపాయి నిధులు లేకుండా దోచేసి సంక్షోభంలోకి నెట్టేశారని అన్నారు. అలాంటి సంక్షోభ సమయంలో నమ్మకంతో ఎన్డీయే కూటమిని గెలిపించిన ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీయే కూటమి అని ఎమ్మెల్యే అన్నారు. పంచభూతాలను దోచేయడమే కాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో జంతు కొవ్వు పదార్థాలు కలిసిన కల్తీ నెయ్యిని వాడి కోట్లాది హిందువుల మనోభావాలను నాటి వైసీపీ ప్రభుత్వం దెబ్బతిసిందని అన్నారు. అనంతరం ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. బోయరేవుల గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేశామని, అలాగే ఇంటింటికీ మంచినీరు, కాలువల నిర్మాణం, అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇంటి స్థలం, పక్కా గృహాలు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. అంతకు ముందు ప్రజలు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డిని ఘనంగా సన్మానించారు.