ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో పంట కాలువ అభివృద్ధి

గత మూడేళ్లుగా పూడికతీతకు నోచుకోని కాలువ
రైతుల విజ్ఞప్తితో పూడిక తీయించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
2,500 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం

చల్లపల్లి : అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచనల మేరకు రైతులకు సాగునీరు సక్రమంగా సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఇరిగేషన్ శాఖ డీఈఈ రావెళ్ల రవికిరణ్ తెలిపారు. ఆదివారం చల్లపల్లి మండలం వక్కలగడ్డలో ఐదో నెంబర్ యార్లగడ్డ బ్రాంచ్ ఛానల్ పంట కాలువలో మట్టి పూడికతీత పనులు ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు.

ఐదో నెంబర్ యార్లగడ్డ బ్రాంచ్ ఛానల్ పంట కాలువను గత మూడేళ్లుగా పూడిక తీయకపోవటంతో 2,500 ఎకరాల ఆయకట్టు కలిగిన ప్రధాన పంట కాలువ పంట బోదులా మారిపోయింది. ఈ సమస్యను ఆయకట్టు రైతులు ఇటీవల అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సూచనల ప్రకారం ఇరిగేషన్ శాఖ డీఈఈ రవికిరణ్ పర్యవేక్షణలో ఐదో నెంబర్ యార్లగడ్డ బ్రాంచ్ ఛానల్ పూడికతీత పనులు చేపట్టారు.

తమ పంట కాలువ అభివృద్ధి చెందటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ సాగునీటి సమస్య పరిష్కారం చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాదుకు, ఇరిగేషన్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.