-దర్శనాల పేరుతో దేవస్థాన అధికారుల లూటీ
-ప్రోటోకాల్ వీఐపీ దర్శనాల్లో వసూళ్ల పర్వం
-ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న భక్తులు
చిత్తూరు: సుదూర ప్రాంతాల నుంచి భక్తిశ్రద్ధలతో కాణిపాకం ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులను దేవస్థానం నిలువు దోపిడీ చేస్తోంది. సాధారణంగా ఏ ఆలయాల్లో అయినా భక్తులను ఏ వ్యాపారులో, దళారులో మోసం చేసి దోపిడీలకు పాల్పడుతుంటారు. అయితే అందుకు భిన్నంగా కాణిపాకం దేవస్థానంలో ఆలయ అధికారులే తమ సిబ్బంది ద్వారా భక్తులను దోచుకుంటున్నారు. దేవ స్థానం వద్ద స్వామి దర్శనం కోసం ఉచిత దర్శనంతో పాటు రూ.51 శీఘ్రదర్శ నం, రూ.150 అతి శీఘ్ర దర్శనం టిక్కెట్లను విక్రయిస్తుంటారు. అలాగే ప్రోటోకాల్ వీఐపీలకు వీఆర్వో కార్యాలయం ద్వారా ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఆలయ అధికారులు ఇదే అదునుగా భావించి భక్తులను నిలువు దోపిడీ చేస్తూ ప్రతిరోజు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు.
సాధారణ భక్తులతోనే ప్రోటోకాల్ వీఐపీ దర్శనం
ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు ఏర్పాటు చేయాల్సిన వీఆర్వో కార్యాలయం సిబ్బం ది దేవస్థానం ఉన్నతాధికారుల ఆదేశాలు సూచనలు మేరకు రూ.500 టిక్కెట్లు, రూ.1000 టిక్కెట్లు విక్రయిస్తూ సామాన్య భక్తులతో పాటు దర్శనాలు కల్పిస్తు న్నారు. ఆలయంలో రూ.500 టిక్కెట్ తీసుకున్న భక్తులకు ప్రత్యేక దర్శనంతో పాటు సాధారణ ఆశీర్వచనం చేయాల్సి ఉంది. అలాగే వెయ్యి రూపాయలు టిక్కెట్ తీసుకున్న భక్తులకు ప్రత్యేక దర్శనంతో పాటు ప్రత్యేక ఆశీర్వచనం చేయాల్సి ఉంది. ఈ మేరకు పీఆర్‌ఓ కార్యాలయం ద్వారా ప్రతిరోజు 500 నుంచి 1500 టిక్కెట్ల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టికెట్లు తీసుకున్న భక్తులందరికీ ఆశీర్వచనం అందించకపోగా సాధారణ భక్తులతో పాటు లఘు దర్శనం మాత్రం కల్పిస్తుండడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించే భక్తుల పట్ల ఆలయ అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా రూ.500 టిక్కెట్ తీసుకున్న నెల్లూరు వాసులతో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఈ నిలువు దోపిడీపై మీడి యా ముందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు నాలుగు నెలలుగా దేవస్థానం వద్ద ఇదే తంతు కొనసాగుతోంది. ఆలయ ఉన్నతాధికారి ఆదేశాల మేరకే ఈ విధంగా నిలువు దోపిడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫిర్యాదుకు సిద్ధమవుతున్న భక్తులు
గతంలో ప్రస్తుతం ఉన్న పంచామృతాభిషేకం టిక్కెట్లను మూడు కాలాల పాటు నిర్వహించకుండా ఏకకాలంలో నిర్వహించాలని ఉద్దేశంతో రూ.5000 టిక్కెట్ ధర నిర్ణయించి భక్తుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు గతంలో ఉన్న ఈవో సురేష్ బాబు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయనను దేవదాయ శాఖ ఉన్నతా ధికారులు వివరణ కోరుతూ ఆగమేఘాలపై ఇక్కడి నుంచి బదిలీ చేశారు. అయి తే ప్రతిరోజు లక్షలాది రూపాయలు భక్తుల నుంచి రూ.500లు, రూ.1000లు టిక్కెట్లు విక్రయిస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న ఆలయ ఉన్నతాధికారిపై దేవాదాయ శాఖ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నిలువు దోపిడీపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు, స్థానిక జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని భక్తులు తెలిపారు.