గంటా లక్ష్మణ రేఖ దాటేశారా?

భీమిలి నుంచి టీడీపీ టికెట్ పై గెలిచిన గంటా శ్రీనివాసరావు, ఋషికొండ ప్యాలెస్ ను ఒక్కసారిగా వార్తలలోకి తీసుకురావడం ద్వారా “లక్ష్మణ రేఖ ” దాటారనే అభిప్రాయం టీడీపీ వర్గాలలో వ్యక్తమవుతున్నది. జాతీయ మీడియాలో సైతం ఈ ప్యాలెస్ విశేషాలు విస్తృతంగా ప్రసారం అయ్యాయి. ఇంత మైలేజ్ ఒక ఎమ్మెల్యేకి రావడంతో ప్రభుత్వ పెద్దలుకు ఎంబరాస్సింగ్ పరిస్థితి ఎదురైందని అంటున్నారు.

నిజానికి, ఈ ఋషికొండ ఫ్యాలెస్ అంశాన్ని ఎలా డీల్ చెయ్యాలి అనే విషయమై చంద్రబాబు / పవన్ ఇంకా ఒక ఆలోచనకు రాలేదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వానికి ( అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ) రావలసిన క్రెడిట్ అంతా ఓ ఎమ్మెల్యే కొట్టేసిన తరువాత ; ఇక ముఖ్యమంత్రి గానీ / ఉప ముఖ్యమంత్రి గానీ ఋషికొండ వెళ్లి చేసేది కానీ, చూసేది కానీ ఏమీ ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు, చంద్రబాబుకు కావాలనే గంటా శ్రీనివాసరావు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారా అనే కోణం లోనూ కొన్ని రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది.

దీనితో, చంద్రబాబు ప్రయారిటీలలో నుంచి ఋషికొండ పక్కకు జరిగింది. బహుశా, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వం తరఫున ఈ ప్యాలెస్ ను సందర్శించవచ్చు. అప్పుడు కూడా మీడియాకు చూపించడానికి అందులో ఏమీ కొత్తగా లేదు. కాకపోతే, దానిని ఏమి చేయాలనే విషయం దుర్గేష్ రివ్యూ చేయవచ్చు.

సినిమా షూటింగ్ లకు అద్దెకు ఇవ్వడం ద్వారా పర్యాటక శాఖ కొంత ఆదాయం పొందవచ్చు అని వైజాగ్ మీడియా కు చెందిన శశాంక్ మోహన్ అన్నారు.

గంటా శ్రీనివాసరావు మీడియాను వెంటబెట్టుకు మరీ వెళ్లే ముందు ప్రభుత్వ పెద్దలకు మాట మాత్రంగా కూడా చెప్పలేదని అంటున్నారు.

ప్రభుత్వానికి (అంటే బాబుకు ) చెప్పకుండా, పర్యాటక శాఖ మంత్రి కి కూడా చెప్పకుండా, దీనినొక జాతీయ స్థాయి మీడియా ఈవెంట్ గా చేయడం వల్ల ఎదురయ్యే పర్యవసానాలు తెలియనంత అమాయకుడేమీ గంటా శ్రీనివాస రావు కాదు.

ఆయనది చాలా క్యాలిక్యులేటెడ్ బ్రెయిన్. అన్నీ పక్కా గా లెక్కలేసుకునే, గంటా…. చంద్రబాబు కు షాక్ ఇచ్చి ఉంటాడు అని అయన వీర సన్నిహితుడు ఒకరు అన్నారు.

– భోగాది వేంకట రాయుడు