తెలంగాణ లో భారీ పరిశ్రమలకు మోడీ పది పైసలైనా ఇచ్చారా ?

– మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి విమర్శ

హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ రాష్ట్రాభివృద్ధి నిమిత్తం పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సాయంగా ప్రధాన మంత్రి పది పైసలైనా ఇచ్చారా అని మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి నిలదీశారు. ఈ మేరకు వారు తెలంగాణ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఇంకా.. వినోద్‌ ఏమన్నారంటే.. నిన్న కేంద్ర కేబినెట్ కొన్ని రైల్వే లైన్లకు అనుమతి ఇచ్చిందని వార్తలు వచ్చాయి. భద్రాచలం నుంచి మల్కాన్ గిరి రైల్వే లైన్ కు కూడా అనుమతి వచ్చింది. భద్రాచలం లో రైల్వే స్టేషన్ లేదు.

కొత్త గూడెం నుంచి మణుగూరు వెళ్లే దారిలో పాండురంగ పురం రైల్వే స్టేషన్ ఉంటుంది. వాస్తవానికి పాండురంగ పురం నుంచి మల్కన్ గిరి రైల్వే లైన్ అది. ఈ రైల్వే లైన్ ను తెలంగాణ ఓ కోణం లో ఆలోచిస్తే నరేంద్ర మోడీ మరో కోణం లో ఆలోచిస్తున్నారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని ఉద్యమం జరిగింది. ఛత్తీస్ ఘడ్ లోని బైలదిల్లా విశాఖ కన్నా బయ్యారం కే దగ్గర.

బయ్యారానికి రైల్వే లైన్ లేకపోవడం కూడా అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ రాకపోవడానికి కారణం… బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నేపథ్యం లో తాజాగా ప్రతిపాదించిన పాండురంగ పురం మల్కాన్ గిరి స్వాగతించదగ్గదే. 2017 లో కేంద్ర ప్రభుత్వం ఉక్కు పాలసీ ప్రకటించింది. 2030 నాటికి తలసరి ఉక్కు వినియోగాన్ని భారీ గా పెంచాలని ఆ పాలసి లో ప్రతిపాదించారు. బయ్యారం లో తెలంగాణ స్టీల్ ప్లాంట్ పెడితేనె ఈ తలసరి వినియోగం పెరుగుతుంది. పదేళ్లుగా బీజేపి కేంద్రం లో అధికారం లో ఉంది. తెలంగాణ లో భారీ పరిశ్రమలకు మోడీ పది పైసలైనా ఇచ్చారా ?

తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీ లు గెలిచారు .ఇప్పటికైనా వారు విభజన చట్టం లో ఉన్న హామీలు నెరవేర్చేందుకు కృషి చేయాలి. కొత్త రైల్వే లైన్ ఖనిజ సంపదను గుజరాత్ తరలించేందుకు ఉపయోగపడేదిగా ఇది మారకూడదు. బయ్యారం లో 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పాదక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనీ గతం లోనే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ వస్తే 4 వేల మందికి ప్రత్యక్షంగా ,పది వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. పాండురంగ పురం మల్కాన్ గిరి రైల్వే లైన్ దృష్ట్యా వెంటనే బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కు ప్రధాని మోడీ చర్యలు చేపట్టాలి. బయ్యారం లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తేనే ఈ రైల్వే లైన్ తెలంగాణ కు ఉపయోగపడుతుంది..