ఇంట్లో కూర్చోబెట్టాక తెలంగాణ యువత గుర్తొచ్చిందా?

పదేళ్లలో రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారు?
లీకుల గురించి మాట్లాడే దమ్ముందా?
ఎగిరెగిరి పడుతున్నావ్‌…నోరు జాగ్రత్త
నమ్మించి గొంతుకోసే రకం కాదు
కేటీఆర్‌కు ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌ కౌంటర్‌

హైదరాబాద్‌, మహానాడు : తెలంగాణా ఏర్పడ్డాక మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నువ్వు, మీ నాన్న తెలంగాణ సమాజా నికి ఒరగబెట్టింది ఏంటి? ఇప్పుడు ఇంట్లో కుర్చోబెట్టాక తెలంగాణ యువత గుర్తుకు వచ్చిందా? అని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌ శుక్రవారం కౌంటర్‌ ఇచ్చారు. నిరుద్యోగ భృతిపై, వంద రోజుల పాలనపై కేటీఆర్‌ ట్వీట్‌కు కౌంటర్‌గా ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లలో ఒక్కసారి అయినా యువతను కలిసిన పాపాన పోలేదు.. ఇప్పుడు ఎగిరి గంతేస్తున్నావ్‌ అంటూ మండిపడ్డారు. మొన్నటి బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో విద్యార్థులు, యువత కు సంబంధించిన అంశం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు.

ఇంటికో ఉద్యోగం అనే నినాదంతో 2014లోకి అధికారంలోకి వచ్చి గత పదేళ్లలో ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని.. కానీ, మీ ఇంటి నిండా ఉద్యోగాలు సంపాదించుకున్నారని వ్యాఖ్యానించారు. మీరు ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్‌లో చిక్కు ముడులతో న్యాయ స్థానం రద్దు చేసింది. ఇప్పుడు నువ్వు ఎవరిని తప్పు పడుతున్నావ్‌? వాటికి కూడా నేనే కారణం అంటావా? లీకుల గురించి నోరు మెదిపితే ఎక్కడ నీ బాగోతం బయటపడుతుంది అని తెలివిగా ఆ విషయాన్ని ప్రస్తావించటం లేదన్నారు.

ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు యువతకు అందు బాటులోనే ఉన్నారు. నోరు జాగ్రత్త… నీ అహంకారమే నీకు శత్రువు అని గుర్తించుకో… తెలంగాణ ఉసురు పోసుకుంది నువ్వూ, నీ కుటుంబం కాదా…అందుకే మట్టికొట్టుకుపోయారంటూ ధ్వజమెత్తా రు. వచ్చే ఎన్నికల వరకు మీ పార్టీ ఉంటదా..ఊడతదా అని చర్చ నడుస్తోంది..నేను మీలాగా నమ్మిం చి గొంతుకోసే రకం కాదు.. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నా. కేసీఆర్‌కు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు. తెలంగాణ యువత భవిష్యత్తు మా గ్యారంటీ. ఎండల వేడి వల్ల ఆగం అవుతున్నావ్‌..నువ్వు ఏసీ ఫుల్‌ పెట్టుకుని ఇంట్లో బజ్జో అంటూ సమాధానమిచ్చారు.