-ముఖ్యమంత్రి భాషేనా అది..
-ఉద్దెర మాటలు ఆపుతావా
-హామీలు అమలుచేయకుండా దగా చేశావ్
-బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు తెలుసు
-కరీంనగర్ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే…
-ప్రచారంలో మాజీ మంత్రి హరీష్‌రావు
కరీంనగర్, మహానాడు: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ దగా చేసిందని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. కరీంనగర్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మాజీ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌లో చదువుకున్న విద్యార్థిని నేను. కరీంనగర్ బీఆర్ ఎస్‌కు పుట్టినిల్లు…బీఆర్‌ఎస్ హయాంలో ఇక్కడ జరిగిన అభివృద్ధి చూస్తే రెండు కళ్లు సరిపోతలేవు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కరీం నగర్ నుంచి హైదరాబాద్‌కు రైల్వే లైన్ మంజూరైంది. వినోదన్న జాతీయ రహదారి సాధించారు. గత ఎన్నికల్లో బీజేపీ భావోద్వేగాలు రెచ్చగొట్టడం వల్లే బండి సంజయ్ గెలిచాడు. ఐదేళ్లలో ఆయన కరీంనగర్‌కు చేసిందేమీ లేదు. వినోదన్న ఓడిపోయినా కరీంనగర్ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేశా రు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ చేసిందేమీ లేదు. నవోదయ విద్యాయాలు ఇవ్వలేదు. మెడికల్ కాలేజీ అడిగితే మొండిచేయి చూపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. నిరుద్యోగం, పేదరికం పెరిగాయి. పదేళ్లలో బీజేపీ చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పండి. కరీంనగర్‌కు నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీలు తెచ్చింది బీఆర్‌ఎస్. బీజేపీ వాళ్లు ఇంటికో క్యాలెండర్, చిత్రపటాలు పంచుతున్నారు. అవి కడుపు నింపుతాయా? అని ప్రశ్నించారు.
ప్రజలను దగా చేశారు
కాంగ్రెస్ వందరోజుల పాలనలోనే ప్రజలకు ఎన్నో కష్టాలు వచ్చాయి. మంచినీళ్లు సరిగ్గా రావడం లేదు. ఎన్నికల హమీలను అమలు చేయకుండా ప్రజలను దగా చేశారు. బాండు పేపర్లు రాసిచ్చి మరీ మోసం చేశారు. రైతులకిచ్చిన హామీలు నెరవలేరలేదు. 4 వేల పింఛన్ ఊసే లేదు. నిరు ద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడిగితే ఆ హామీనే ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలాడుతున్నారు. మాట తప్పిన రేవంత్‌రెడ్డీ ఎంపీ ఎన్నికల్లో ప్రజలు నీకు చురుకు పెడతారు..కాంగ్రెస్ ప్రజలను ఉద్ధరించే మాటలు కావు, ఉద్దెర మాటలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇది ముఖ్యమంత్రి భాషేనా?
కేసీఆర్ చెడ్డీ ఊడగొడుతా అంటున్నాడు రేవంత్. నువ్వు చెడ్డీ గ్యాంగ్ వెంట తిరిగినవా రేవంత్? ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా? కేసీఆర్ రైతుల కోసం ప్రశ్నించిండు. రేవంత్ తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిండు. ఎన్నడైనా జై తెలంగాణ అన్నాడా? ఆ పనిచేయని నువ్వు కనీసం అమరవీరుల స్తూపం వద్ద పువ్వులైనా పెట్టి నివాళులు అర్పించు.
బడే బాయ్ …చోటే బాయ్ ఒక్కటయ్యారు!
బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అని అసెంబ్లీ ఎన్నికల్లో దుష్ప్రచారం చేశారు. కుమ్మక్కైంది బీజేపీ, కాంగ్రెస్సే. కరీంనగర్‌లో కాంగ్రెస్ ఇంతవరకు ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి. చాలా చోట్ల కాంగ్రెస్ బహీనమైన అభ్యర్థులను బరిలో దింపుతోంది. కరీంనగర్ కోసం వినోదన్న పార్లమెంటులో గొంతెత్తిండు. ప్రజలు ఆయనను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.