పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్లను తొలగింపు అన్యాయం

– మాజీ మంత్రి హరీష్‌ రావు ఆక్షేపణ

హైదరాబాద్‌, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6200 మంది పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడం అన్యాయమని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే… ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా రేవంత్ రెడ్డి గారు.! పార్ట్‌టైం టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలు ను ఏకకాలంలో విధుల నుండి తొలగించడం దుర్మార్గమైన చర్య. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మూడు నెలలుగా జీతాలు చెల్లించరు, అడిగినందుకు ఉద్యోగాల నుండి తొలగిస్తారు. ఇదేనా మీ ప్రజా పాలన? ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం?

విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లను తొలగించి వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల బతుకులను ఆగం చేశారు. మరోవైపు మీ నిర్లక్ష్య, అర్థం లేని నిర్ణయం వల్ల వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తొలగించిన పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్లు, డీఈవోలను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, మూడు నెలల పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.