– ఎమ్మెల్యే అరవిందబాబు
విజయవాడ, మహానాడు: కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవడాన్ని మించిన సేవ ఏముంటుందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు. కృష్ణా వరదలతో అతలాకుతలమైన విజయవాడ నగరంలోని 40వ డివిజన్లో ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీలో పాల్గొన్నారు. ఇప్పటికే నరసరావుపేట నుండి మంచినీటి ట్యాంకర్లను పంపించిన అరవిందబాబు, బుధవారం తానే స్వయంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితుల్ని క్షేత్రస్థాయిలో తెలుసుకున్న అనంతరం కార్యక్షేత్రంలోకి దిగారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
బియ్యం, కందిపప్పు, వంట నూనె, మంచినీళ్లు, పంచదార, టీపొడితో కూడిన కిట్లను అందించారు. గడపగడపకూ వెళ్ళి బాధితులకు అందించి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ప్రజలకు సేవ చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ ఉదారంగా ఉంటుందన్నారు. నిలువ నీడ కూడా లేకుండా చాలా మంది పడుతున్న బాధలు చూస్తుంటే కన్నీళ్ళు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి ఉపద్రవం ముంచుకొచ్చినా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ప్రాణనష్టం లేకుండా చేసుకోగలిగామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు.