పునరావాస కేంద్రాల్లో రగ్గులు, మంచినీటి బాటిళ్ళ పంపిణీ

– పెమ్మసాని ఫౌండేషన్ ఔదార్యం
– సమస్యలు అడిగి తెలుసుకున్న రవిశంకర్

తాడికొండ, మహానాడు: వరద బాధితులకు పెమ్మసాని ఫౌండేషన్ చేయూతనిస్తోంది. ఇళ్ళు నీట మునిగి పునరావాస కేంద్రాల్లో తల దాచుకున్న వారికి మేమున్నామనే భరోసా ఇస్తోంది. పెమ్మసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెమ్మసాని రవిశంకర్ స్థానిక ఎమ్మెల్యే తాడికొండ శ్రావణ్ కుమార్ తో కలిసి తాడికొండ నియోజకవర్గంలో రెండు వేల మందికి రగ్గులు బుధవారం పంపిణీ చేశారు.

తొలుత వెంకటపాలెం ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ పునరావాస కేంద్రానికి చేరుకున్న రవిశంకర్ అక్కడ వరద బాధితులతో మాట్లాడారు. అక్కడ వంద మందికి రగ్గులు పంపిణీ చేశారు. అనంతరం తాళ్లాయపాలెం ఎస్సీ కాలనీలోని పునరావాస కేంద్రంలో 400 మందికి, ఉద్దండరాయునిపాలెం బాప్టిస్టు చర్చిలోని పునరావాస కేంద్రంలో 450 మందికి, లింగాయపాలెంలో 400 మందికి, రాయపూడిలో 300 మందికి, హరిశ్చంద్రాపురంలో 300 మందికి రగ్గులు, మంచినీటి క్యాన్లు పంపిణీ చేశారు.

అధైర్య పడొద్దు.. పిలుపు దూరంలో ఉంటాం

ఎన్నడూలేని విధంగా సెప్టెంబర్ లో అధిక శాతం వర్షపాతం నమోదైందని, దీంతో వరద చుట్టుముట్టిందని పెమ్మసాని రవిశంకర్, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులతో రవిశంకర్ మాట్లాడారు. ప్రభుత్వ పరంగా అందుతున్న సహాయ సహకారాల గురించి అడిగి తెలుసుకున్నారు. 2-3 రోజుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఏ చిన్న కష్టమొచ్చినా పిలుపు దూరంలో ఉంటామని, పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా చేయూతనిస్తామని భరోసా కల్పించారు.

రూ.50 వేలు విరాళం

వరద బాధితుల సహాయార్థం పెద పరిమికి చెందిన టీడీపీ నేత కావూరి దాసు రూ.50 వేలు చెక్కు విరాళంగా అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు వరద బాధితుల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని విరాళం అందజేసిన దాసుకు ఈ సందర్భంగా పెమ్మసాని రవిశంకర్ అభినందనలు తెలిపారు. బాధితులకు ప్రతి ఒక్కరూ చేతనైనంత సాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుళ్ళూరు మండల పార్టీ ప్రెసిడెంట్ తనెకుల వెంకట సుబ్బారావు, పార్టీ సీనియర్ నేతలు బెల్లంకొండ నరసింహారావు, బెజవాడ రమేష్ తో పాటు స్థానిక మండల, గ్రామ స్థాయి టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు.