రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించొద్దు

రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ
-మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్, మహానాడు : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి బీఅర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా దేశ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ అధినేత రాహుల్ గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు.

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…రాహుల్ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని చెప్పిందేంటి ? చేస్తున్నదేంటి అని ప్రశ్నించారు. ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని ప్రమాణం చేసి ఇంకో చేత్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో రాహుల్ గాంధీ కరచాలనం చేస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను రక్షించడం, గౌరవించడం మా బాధ్యత అన్నారు. రాజీవ్ హయాంలో తెచ్చిన యాంటీ డిఫెక్షన్ లా ను మ్యాండేటరీ చేస్తాం.. మరింత పటిష్టం చేస్తాం అన్నారు. కానీ దీనికి విరుద్ధంగా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. రాజకీయ విలువలు, ధర్మసూత్రాలకు రాహుల్ కట్టుబడి ఉంటే పార్టీలో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. కేశవరావుతో రాజీనామా చేయించినట్లు, పార్టీలో చేరిన మిగతా వాళ్లు రాజీనామా చేసి పార్టీలో చేరాలన్నారు.

నాగరికుడిగా, ఈ దేశ పౌరుడిగా ప్రశ్నిస్తున్నాను అని రాహుల్ అనేక సార్లు పార్లమెంటులో అన్నారు. మేము సుందర భారతం నిర్మిస్తామని అన్నారు. రాహుల్ నోటి నుండి చెప్పిన ప్రకారం తెలంగాణలో ఆరు గ్యారంటీలకు దిక్కు లేదు.

ప్రజా ప్రతినిధుల పార్టీ మార్పును నిస్సిగ్గుగా ఎలా స్వీకరిస్తారు ? మాజీ స్పీకర్ ను చేర్చుకుంటున్నామని గర్వంగా చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం ? రాహుల్ వీటిని ఎలా సమర్దించుకుంటారు.

ఈ లేఖ అంశాన్ని ఇక్కడితో వదలం .. జాతీయ స్థాయిలో ప్రశ్నిస్తాం .. స్వయంగా రాహుల్ దీనికి సమాధానం చెప్పాలి. రాహుల్ మీద బీజేపీ అక్రమ కేసులు వేసి, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి, అయన క్వార్టర్ ఆగమేఘాల మీద రద్దు చేసి అమానుషంగా ప్రవర్తించినప్పుడు పార్టీలకు అతీతంగా సానుభూతి చూపించాం.

సర్వోన్నత న్యాయస్థానం మీద నమ్మకం ఉందని రాహుల్ అన్నారు.. అదే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు పార్టీ మారిన వారి సభ్యత్వం రద్దు కావాలని చెబితే తెలంగాణ కాంగ్రెస్ స్పీకర్ ను ఎందుకు మీరు ఆదేశించరు. డబల్ స్టాండర్డ్ మూలంగా మోడీ ఈ ఎన్నికల్లో ప్రజల విశ్వాసం కోల్పోయి మిత్రపక్షాల సహకారంతో గద్దెనెక్కాడు.

రాహుల్ మీ డబల్ స్టాండ్స్ చూసి మిగతా రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించరా ? మిమ్మల్ని ఎలా నమ్ముతారు? ఏడుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకోలేని రాహుల్ దేశాన్ని ఎలా మెప్పిస్తాడు ? తెలంగాణలో చేరికల విషయంలో రాహుల్ గాంధీ మేం లేవనెత్తిన అంశాలపై ఖచ్చితంగా స్పందించాలి.

ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణలోని అన్ని వర్గాలను వంచించారు. నిరుద్యోగులను అమానుషంగా మోసం చేసారు. మీరు ఇచ్చిన హామీలపై ఆశపడ్డ వర్గాలు భవిష్యత్తులో ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తారని బహిరంగ లేఖలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.